అంచనాలు పెంచకు సైరా..

అంచనాలు పెంచకు సైరా..

ఈ రోజుల్లో సినిమాకు ఓపెనింగ్స్ చాలా కీలకం. ఇందుకోసం విడుదలకు ముందుకు విపరీతమైన హైప్ తీసుకురావడం కామన్ అయిపోయింది. భారీ చిత్రాల్ని అందుబాటులో ఉన్న అన్ని థియేటర్లలో పెద్ద ఎత్తున విడుదల చేయడం.. టికెట్ల రేట్లు పెంచడం, అదనపు షోలు వేయడం.. అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా అయ్యేలా చూసి తొలి వారాంతంలో ఎంతగా వీలైతే అంతగా వసూళ్లు పెంచుకునే ప్రయత్నం చేయడం కామన్ అయిపోయింది.

టీజర్, ట్రైలర్ కట్స్ కూడా అంచనాలు పెంచి జనాలు సినిమా కోసం ఊగిపోయేలా చేయడం అన్నది ఇప్పుడు స్ట్రాటజీగా మారిపోయింది. సినిమాలో ఏదో ఉంటుందని ప్రేక్షకులు భ్రమల్లోకి వెళ్లేలా కూడా ప్రోమోలు కట్ చేస్తున్నారు. కానీ ఓపెనింగ్స్ కోసమని చేస్తున్న ఈ హడావుడి రాను రానూ శ్రుతిమించి పోతోంది. సినిమాపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది.

ఇటీవలే విడుదలైన ‘సాహో’ సంగతే తీసుకుందాం. ఈ సినిమాకు మామూలు హైప్ తెచ్చారా? మేకింగ్ వీడియోలు, టీజర్, ట్రైలర్ చూసి జనాలు ఏదో భ్రమల్లోకి వెళ్లిపోయారు. భారీ అంచనాలు పెట్టుకున్నారు. సినిమాకు ఎక్కడ లేని హైప్ వచ్చేసింది. అది అడ్వాన్స్ బుకింగ్స్‌కు బాగానే ఉపయోగపడింది. ఓపెనింగ్స్ మోతెక్కిపోయాయి. కానీ సినిమా మాత్రం ఉస్సూరుమనిపించేసింది. అంచనాలే ఆ సినిమాకు భారమయ్యాయి. వీకెండ్ వరకు సినిమా పరిస్థితి బాగున్నా.. తర్వాత దబేల్‌మని కింద పడింది. తర్వాత కోలుకోలేకపోయింది. ఓపెనింగ్స్ కోసం చేసిన అనవసర హడావుడి సినిమాకు ప్రతికూలమే అయింది.

ఈ నేపథ్యంలో తర్వాతి భారీ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ విషయంలో ఏం జరుగుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘సైరా’ ప్రోమోలు కూడా ప్రేక్షకుల్లో అంచనాలు పెంచాయి. ఐతే ‘సాహో’ తరహాలో అయితే అనవసర హడావుడి అయితే ఇప్పటిదాకా లేదు. ప్రమోషన్ల విషయంలో కాస్త ఆచితూచి వ్యవహరిస్తున్నారు. కానీ ట్రైలర్ లాంచ్, ఆడియో, ప్రి రిలీజ్ ఈవెంట్లలో ఎలాంటి హడావుడి ఉంటుందో.. సినిమా గురించి ఎంత ఎక్కువ చేసి చెబుతారో అన్నది చూడాలి. చిరు సినిమా అంటే తెలుగు రాష్ట్రాల్లో ఓపెనింగ్స్‌కు ఢోకా ఉండదు. సినిమాకు ఇప్పుడున్న హైప్ సరిపోతుంది. కాబట్టి ‘సాహో’ తరహాలో మరీ అంచనాలు పెంచకుండా ఆచితూచి వ్యవహరించడం మంచిది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English