వెంకీ మామకు ‘బిగిల్’, ‘ఖైదీ’ గోల

వెంకీ మామకు ‘బిగిల్’, ‘ఖైదీ’ గోల

ముందు అనుకున్న ప్రకారం అయితే విక్టరీ వెంకటేష్, ఆయన మేనల్లుడు అక్కినేని నాగచైతన్య తొలిసారి కలిసి నటిస్తున్న ‘వెంకీ మామ’ సినిమాను దసరాకే విడుదల చేయాల్సింది. కానీ ఆ సీజన్‌కు ‘సైరా నరసింహారెడ్డి’ ఖరారవడంతో దసరా సీజన్‌ను విడిచిపెట్టి దీపావళికి వెళ్లిపోయిందీ చిత్రం. మామూలుగా తెలుగులో పెద్ద సినిమాలు దసరానే టార్గెట్ చేస్తాయి. దీపావళిని పట్టించుకోవు.

దీపావళిని మన దగ్గర సంక్రాంతి, దసరాల తరహాలో పెద్ద సీజన్‌గా భావించేది కోలీవుడ్ వాళ్లే. ప్రతిసారీ ఆ పండక్కి భారీ చిత్రాల్ని బరిలో నిలుపుతుంటారు. ఈసారి కూడా అక్కడ ఆ పండక్కి పోటీ తీవ్రంగా ఉంది. సూపర్ స్టార్ విజయ్ నటిస్తున్న ‘బిగిల్’ దీపావళికే విడుదల కాబోతోంది. దీంతో పాటు కార్తి సినిమా ‘ఖైదీ’ కూడా ఆ పండక్కే వస్తోంది. ఇంకో రెండు సినిమాలు కూడా వచ్చే అవకాశాలున్నాయి.

తెలుగులో సైతం ‘బిగిల్’, ‘ఖైదీ’ చిత్రాల్ని తమిళంతో పాటే రిలీజ్ చేయనున్నారు. విజయ్, కార్తిలకు తెలుగులో మంచి మార్కెట్టే ఉన్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు విజయ్‌ని మన జనాలు లైట్ తీసుకునేవాళ్లు కానీ.. గత కొన్నేళ్లలో అతడి ఫాలోయింగ్ బాగా పెరిగింది. దీపావళి అంటే విజయ్‌కి సెంటిమెంటు. తుపాకి, కత్తి, తెరి, మెర్శల్, సర్కార్ లాంటి సినిమాల్ని ఆ పండక్కే రిలీజ్ చేశాడు. వీటిలో సర్కార్ మినహా అన్నీ బ్లాక్ బస్టర్లే. ఇప్పుడు ‘బిగిల్’ను కూడా అదే సీజన్లో వదులుతున్నాడు.

తనకు ‘తెరి’, ‘మెర్శల్’లతో బ్లాక్ బస్టర్లు అందించిన అట్లీతో విజయ్ చేస్తున్న మూడో సినిమా ఇది. తెలుగులో ‘విజిల్’ పేరుతో పీఆర్వో టర్న్డ్ ప్రొడ్యూసర్ మహేష్ కోనేరు రిలీజ్ చేయనున్నాడట. ఇక ‘నగరం’ అనే సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో కార్తి చేసిన వెరైటీ మూవీ ‘ఖైదీ’ కూడా దీపావళికి ‘వెంకీ మామ’ను ఢీకొనబోతోంది. ఈ రెండు డబ్బింగ్ సినిమాలూ మంచి కంటెంట్ ఉన్నవే కావడంతో ‘వెంకీ మామ’కు వాటి నుంచి ఎంతో కొంత పోటీ తప్పదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English