సురేష్ బాబు వదిలేశాడు.. దిల్ రాజు అందుకున్నాడు

సురేష్ బాబు వదిలేశాడు.. దిల్ రాజు అందుకున్నాడు

నటుడిగా రొటీన్ విలన్ పాత్రలు చేసిన రవిబాబు.. దర్శకుడిగా మారి అంత విలక్షణమైన సినిమాలు తీస్తాడని ఎవరూ ఊహించలేదు. ‘అల్లరి’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన అతను.. ఆ తర్వాత మరెన్నో వైవిధ్యమైన చిత్రాలు అందించాడు. కానీ కొన్నేళ్లుగా అతడికి కాలం కలిసి రావట్లేదు. ‘అవును-2’, ‘అదిగో’ చిత్రాలు దారుణమైన పరాజయాల పాలయ్యాయి. అతడికున్న గుర్తింపును ఈ సినిమాలు బాగా దెబ్బ తీశాయి.

వరుసగా రవిబాబుతో సినిమాలు నిర్మించిన అగ్ర నిర్మాత సురేష్ బాబు సైతం అతడి మీద నమ్మకం కోల్పోయాడు. రవిబాబు కొత్త సినిమా ‘ఆవిరి’తో ఆయన అసోసియేట్ కాలేదు. ఐతే ఎవరో ఒకరి భాగస్వామ్యంలోనే సినిమాలు తీసే రవిబాబు.. ఈసారి దిల్ రాజు సపోర్ట్ తీసుకోవడం విశేషం.

‘ఆవిరి’ ఫస్ట్ లుక్ ఈ రోజే రిలీజైంది. కుక్కర్లో ఉడికిపోతున్న అమ్మాయి కళ్లను, పక్కన ఉబికి వస్తున్న ఆవిరిని చూపిస్తూ రవిబాబు తనదైన శైలిలో ఫస్ట్ లుక్ పోస్టర్ డిజైన్ చేశాడు. తన సినిమాల ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ తన రూటు సెపరేటే అని రవిబాబు మరోసారి రుజువు చేశాడు. టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ని బట్టి చూస్తే రవిబాబు మరో ప్రయోగమేదో చేస్తున్నట్లే ఉంది.

తన సినిమాల్లో ప్రత్యేక పాత్రలు చేయడం అలవాటైన రవిబాబు.. ‘ఆవిరి’లో ప్రధాన పాత్రే పోషిస్తున్నాడు. నేహా చౌహాన్ అనే కొత్తమ్మాయి కథానాయికగా నటిస్తోంది. ఇంకొందరు కొత్త నటీనటులు ఈ సినిమాలో కనిపించనున్నారు. సీనియర్ రచయిత సత్యానంద్ రచనా సహకారం అందిస్తున్న ఈ చిత్రానికి ఇటీవలే ‘నాల్’ అనే మరాఠీ చిత్రంతో జాతీయ ఉత్తమ డెబ్యూ డైరెక్టర్‌గా అవార్డు అందుకున్న సుధాకర్ రెడ్డి ఛాయాగ్రహణం సమకూరుస్తున్నాడు. రవిబాబు సినిమాలకు చాలా కాలం నుంచి అతనే సినిమాటోగ్రఫీ అందిస్తున్న సంగతి తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English