బాలీవుడ్ బోనీ.. తెలుగులో బోణీ?

బాలీవుడ్ బోనీ.. తెలుగులో బోణీ?

శ్రీదేవికి దక్షిణాది సినిమాతో ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక్కడ ఆమె రెండు దశాబ్దాల పాటు కథానాయికగా ఒక వెలుగు వెలిగింది. ఆ తర్వాత హిందీలోకి వెళ్లింది. అక్కడా సూపర్ స్టార్ ఇమేజ్ సంపాదించింది. స్వతహాగా దక్షిణాది అమ్మాయే కావడంతో ఈ నేలతో తన అనుబంధాన్ని ఆమె మరిచిపోలేదు. సౌత్ గురించి ఎప్పుడు మాట్లాడినా ప్రత్యేక అనుభూతికి గురవుతుంది.

ఇప్పుడు ఆమె తనయురాలు జాన్వి.. తన పెళ్లి తిరుపతిలోనే జరుగుతుందని, పెళ్లిలో దక్షిణాది వంటకాలతోనే భోజనం పెడతామని అందంటే సౌత్‌తో తన తల్లికి ఉన్న అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకునే. మరోవైపు శ్రీదేవి భర్త బోనీ కపూర్.. భార్య మరణానంతరం సౌత్ సినిమాలపై దృష్టిపెట్టడం విశేషం. ఇక్కడి సినిమాల్ని హిందీలో రీమేక్ చేస్తుండటమే కాదు.. నేరుగా దక్షిణాదిన సినిమాలు కూడా నిర్మించే పనిలో పడ్డాడు బోనీ.

ఆల్రెడీ శ్రీదేవికి క్లోజ్ ఫ్రెండ్ అయిన అజిత్ కుమార్‌తో తమిళంలో ‘నీర్కొండ పార్వై’ అనే సినిమాను నిర్మించాడు బోనీ. ఇది ‘పింక్’ చిత్రానికి రీమేక్. ఆ వెంటనే ఈ చిత్ర దర్శకుడు వినోద్, అజిత్ కలయికలో ఓ స్ట్రెయిట్ మూవీని నిర్మించడానికి కూడా రంగం సిద్ధం చేశాడు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లనుంది. ఇప్పుడు బోనీ తెలుగులోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం.

శ్రీదేవికి ఫ్రెండే అయిన నాగార్జున ఫ్యామిలీతో ఆయన అసోసియేట్ అవుతున్నాడట. నాగ్ పెద్ద కొడుకు నాగచైతన్య హీరోగా ఓ హిందీ చిత్రాన్ని రీమేక్ చేయబోతున్నాడట బోనీ. హిందీలో గత ఏడాది పెద్ద విజయం సాధించిన ‘బదాయి హో’ చిత్రాన్ని చైతూ ప్రధాన పాత్రలో రీమేక్ చేయాలన్నది బోనీ ఆలోచనట. ఈ దిశగా చర్చలు జరుగుతున్నాయట. మరోవైపు ‘పింక్’ను కూడా తెలుగులో రీమేక్ చేయడానికి ఆయన చూస్తుండటం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English