తెలుగు డబ్బింగ్.. ఇంత దారుణమా?

 తెలుగు డబ్బింగ్.. ఇంత దారుణమా?

ఉత్తరాది వాళ్లకు దక్షిణాది అంటే ఒక రకమైన చిన్నచూపు.  మనం వాళ్ల హిందీని సిలబస్‌గా పెట్టుకుని చదువుకుంటాం. కానీ వాళ్లకు మన ‘తెలుగు’ను ‘తెలుగు’ అని సరిగ్గా పలకడం కూడా రాదు. సోషల్ మీడియాలో telegu అని.. telgu అని రాయడం చూస్తుంటాం. ఇది ఎవరో అనామకులు చేసినా ఓకే అనుకోవచ్చు. కానీ ప్రముఖులు సైతం ఇలా తెలుగును కించపరుస్తుంటారు.

ఇక హిందీ నుంచి తెలుగులోకి డబ్బింగ్ చేసే క్రమంలో మన భాషను ఎంతగా కూనీ చేయాలో అంతగా చేస్తారు. తెలుగు డబ్బింగ్ పోస్టర్లు చూస్తేనే బెంబేలెత్తిపోవాల్సి ఉంటుంది. డైలాగులు.. పాటల్లో లిరిక్స్ ఎంత ఘోరంగా ఉంటాయంటే.. కృతకమైన ఆ డబ్బింగ్ వింటే మనోళ్ల చెవుల్లోంచి రక్తం బయటికి రావాల్సిందే. పాటలు సంగీత హోరులో కొట్టుకుపోతాయి కాబట్టి సరిపోయింది కానీ.. లేదంటే అవన్నీ విని తట్టుకోవడం చాలా కష్టం.

ఐతే కనీసం పోస్టర్లయినా సరిగా వేయాలన్న జ్ఞానం లేకపోవడం దారుణం. తాజాగా హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్‌ల ‘వార్’ సినిమా పోస్టర్ రిలీజ్ చేసింది యశ్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ. అందులో అన్నీ స్పెలింగ్ మిస్టేక్‌లే ఉన్నాయి. హృతిక్ పేరును ‘హృథిక్’ అని రాశారు. యశ్ రాజ్ పేరును ‘యష్ రాజ్’ అన్నారు. ఆదిత్య చోప్రా పేరునైతే మరీ దారుణంగా ‘ఆదిత్య ఛోప్‌రా’ అని పేర్కొన్నారు.

సినిమా పేరు సింపుల్‌గా ‘వార్’ అని పెట్టారు కాబట్టి సరిపోయింది కానీ.. కాస్త కష్టమైన పేరు ఉంటే అదెలా కూనీ అయ్యేదో. హిందీని తెలుగులోకి తర్జుమా చేసేవాళ్లు తెలుగువాళ్లే కదా? మరి ఇంత దారుణమైన అనువాదం ఏమిటో అర్థం కాదు. హిందీ ప్రకటనల్ని తెలుగులోకి అనువాదం చేసేవాళ్ల తీరు కూడాా ఇలాగే ఉంటుంది. ఇంగ్లిష్, హిందీ వాక్యాల్ని కృతకమైన రీతిలో అనువాదం చేసి పెడుతుంటారు. ఈ విషయంలో ఆ మాత్రం శ్రద్ధ లేకపోవడం దారుణం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English