గ్యాంగ్ లీడర్ ఆడాలని సుక్కు ప్రార్థన

గ్యాంగ్ లీడర్ ఆడాలని సుక్కు ప్రార్థన

‘గ్యాంగ్ లీడర్’ సినిమా మీద చాలామంది చాలా ఆశలే పెట్టుకున్నారు. రెండు ఫ్లాపుల తర్వాత ‘జెర్సీ’తో కాస్త నిలదొక్కుకున్న నాని.. ‘గ్యాంగ్ లీడర్’తో పెద్ద హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ‘హలో’తో షాక్ తిన్న విక్రమ్ కె.కుమార్.. మళ్లీ ఈ చిత్రంతోనే సక్సెస్ ట్రాక్ ఎక్కాలనుకుంటున్నాడు. కొత్తమ్మాయి ప్రియాంక మోహన్ తెలుగులోకి హిట్ మూవీతో ఎంట్రీ ఇవ్వాలనుకుంటోంది.

ఇక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌కు అయితే ఈ సినిమా హిట్ కావడం చాలా చాలా అవసరం. మూడు వరుస బ్లాక్ బస్టర్లతో ఎంట్రీ ఇచ్చిన మైత్రీ సంస్థ.. ఆ తర్వాత వరుస పరాజయాలతో దెబ్బ తిని ఉంది. ఈ చిత్రం హిట్ కావడం మైత్రీ వాళ్లకు చాలా అవసరం. వీళ్లందరితో పాటు స్టార్ డైరెక్టర్ సుకుమార్ సైతం ‘గ్యాంగ్ లీడర్’ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇందుకు కారణాలు లేకపోలేదు.

‘రంగస్థలం’ తర్వాత తన తర్వాతి సినిమాను కూడా మైత్రీ సంస్థలోనే చేయబోతున్నాడు సుక్కు. ఈ సంస్థ ఒక రకంగా సుక్కుకు సొంత బేనర్ లాగా తయారైంది. బన్నీతో ఇప్పుడు చేయబోయే సినిమాతో పాటు ఆ తర్వాతి చిత్రం కూడా సుక్కు మైత్రీలోనే చేసే అవకాశముంది. ఆ సంస్థ అధినేతలతో అంతటి అనుబంధం నెలకొంది సుక్కుకు. ఈ సంస్థ నిర్మించే వేరే సినిమాల్ని సైతం ఆయన పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు శిష్యులు సైతం కొందరు మైత్రీ బేనర్లోనే దర్శకులయ్యే ప్రయత్నాల్లో ఉన్నారు. అందులో బుచ్చిబాబు సన ఒకడు. అతను ఈ బేనర్లో ‘ఉప్పెన’ చేస్తున్నాడు. గత ఏడాది కాలంలో ఎదురైన చేదు అనుభవాలతో మైత్రీ సంస్థ ఆర్థికంగా ఇబ్బందుల్లో పడింది.

ఇప్పుడు ‘గ్యాంగ్ లీడర్’ ఆడకుంటే తర్వాతి సినిమాల బడ్జెట్లపై ప్రభావం పడుతుంది. అందులో సుక్కు-బన్నీ సినిమా కూడా ఒకటి. ఈ చిత్ర ప్రి ప్రొడక్షన్ కోసమే చాలా ఖర్చు పెట్టేశారు. సినిమా బడ్జెట్ కూడా ఎక్కువే అయ్యేలా ఉంది. ‘ఉప్పెన’ సైతం కొంత ఖర్చుతో కూడుకున్న సినిమానే. ‘గ్యాంగ్ లీడర్’ ఆడితే ఈ సినిమాల మేకింగ్‌లో ఏ తలనొప్పులు ఉండవు. లేదంటే మాత్రం బడ్జెట్లలో కోత పడొచ్చు. కొంత రాజీ కూడా ఉంటుంది. అందుకే ‘గ్యాంగ్ లీడర్’ ఆడాలని సుక్కు గట్టిగా కోరుకుంటున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English