అప్పుడు సాయిపల్లవి.. ఇప్పుడు చైతూ

అప్పుడు సాయిపల్లవి.. ఇప్పుడు చైతూ

తన సినిమాల్లో పని చేసే నటీనటులకు కెరీర్లో ఎప్పటికీ చెప్పుకునే.. గుర్తుండిపోయే రోల్స్ ఇస్తుంటాడు శేఖర్ కమ్ముల. ముఖ్యంగా ఆయన ఫోకస్ లేడీ క్యారెక్టర్ల మీద ఉంటుంది. ‘ఆనంద్’, ‘గోదావరి’ చిత్రాల్లో కమలిని ముఖర్జీ.. ‘ఫిదా’లో సాయిపల్లవిల క్యారెక్టర్లు ఎంత హైలైట్ అయ్యాయో.. వారికి ఎంత మంచి పేరు తెచ్చి పెట్టాయో తెలిసిందే.

‘ఫిదా’లో సాయిపల్లవి పాత్ర అయితే ‘కల్ట్’ స్టేటస్ సంపాదించింది. ఈ సినిమాలో తెలంగాణ పల్లెటూరి యువతిగా సాయిపల్లవి జీవించేసింది. వేరే రాష్ట్రానికి చెందిన అమ్మాయి.. ఇంత చక్కగా తెలంగాణ యాసను పలకడం.. ఆ యాసలోని మాధుర్యాన్ని ప్రాంతాలకు అతీతంగా జనాలు ఆస్వాదించేలా చేయడం గొప్ప విషయం. ఇందులో కమ్ముల పెట్టిన ప్రత్యేక శ్రద్ధ ప్రశంసనీయం.

ఇప్పుడు నాగచైతన్య-సాయిపల్లవిల కలయికలో తీయబోతున్న కొత్త సినిమాలో కూడా కమ్ముల తెలంగాణ యాసను మరోసారి ఉపయోగించబోతున్నాడట. ఈసారి చైతూను ఆయన తెలంగాణ కుర్రాడిగా చూపించబోతున్నాడట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించాడు. కొన్ని నెలలుగా చైతూ.. తెలంగాణ భాష, యాస మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి నేర్చుకున్నాడని.. పర్ఫెక్షన్ సాధించాడని చెప్పాడు కమ్ముల.

ఇందులో హీరో హీరోయిన్లు వేర్వేరు ప్రాంతాల్లోని పల్లెటూర్ల నుంచి హైదరాబాద్ సిటీకి వచ్చి.. బతుకు పోరాటం సాగించడం.. ఆ క్రమంలో ఒకరితో ఒకరికి పరిచయం కావడం.. ఈ నేపథ్యంలో సినిమా సాగుతుందని కమ్ముల చెప్పాడు. చైతూ తెలంగాణ కుర్రాడైతే.. బహుశా సాయిపల్లవిని ఈసారి ఆంధ్రా అమ్మాయిగా చూపిస్తాడేమో. ఏదేమైనా చైతూ తెలంగాణ కుర్రాడిగా కనిపిస్తూ.. ఇక్కడి భాష, యాసను పలకడం సినిమాలో ప్రత్యేకంగా ఉంటుందనడంలో సందేహం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English