అక్కినేని కుర్రాడి రాత‌.. త్రివిక్ర‌మ్ మార్చేయ‌బోతున్నాడా?

అక్కినేని కుర్రాడి రాత‌.. త్రివిక్ర‌మ్ మార్చేయ‌బోతున్నాడా?

అక్కినేని లాంటి పెద్ద కుటుంబం నుంచి కథానాయకుడిగా పరిచయం అయ్యాడు సుశాంత్. కానీ ఓ మోస్తరు విజయం రుచి చూడటానికి కూడా పదేళ్లకు పైగా ఎదురు చూడాల్సి వచ్చింది. కాళిదాసు, కరెంట్, అడ్డా, ఆటాడుకుందాంరా.. ఇలా అతను తొలి పదేళ్లలో చేసిన సినిమాలన్నీ డిజాస్టర్లే అయ్యాయి.

చివరికి గత ఏడాది ‘చి ల సౌ’ అనే భిన్నమైన చిన్న సినిమాతో పలకరించాడు సుశాంత్. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలందుకుంది. బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించింది. అన్నిటికీ మించి సుశాంత్ ఈసారి ప్రేక్షకుల నుంచి తిట్లు తినలేదు. తన మీద ఉన్న నెగెటివిటీని తగ్గించుకున్నాడు. కుర్రాడు బాగా చేశాడు అనిపించుకున్నాడు. దీని తర్వాత మంచి కమర్షియల్ బ్రేక్ కోసం చూస్తున్నాడు సుశాంత్. ఇలాంటి తరుణంలో హీరోగా కాకుండా సుశాంత్.. క్యారెక్టర్ రోల్ చేయడానికి రెడీ అవడం ఆశ్చర్యం కలిగించింది.

ఐతే ‘అల వైకుంఠపురములో’ సినిమాలో సుశాంత్ చేస్తున్నది హీరో పాత్ర కాదు కానీ.. హీరో పాత్రకు దీటుగా ఉంటుందట. ఇందులో సుశాంత్ అల్ట్రా రిచ్ క్యారెక్టర్ చేస్తున్నాడట. చాలా పొగరుగా ఉండే పాత్ర అతడిదని.. సినిమాలో కీలక మలుపుకు కారణం అవుతుందని.. స్క్రీన్ టైం కూడా ఎక్కువగానే ఉంటుందని అంటున్నారు. ఇంత బలమైన పాత్రకు సుశాంత్‌ను త్రివిక్రమ్ ఎంచుకోవడమే ఆశ్చర్యం అని.. ఈ పాత్ర సుశాంత్ కెరీర్‌నే మలుపు తిప్పుతుందని చిత్ర వర్గాలు చెబుతున్నారు.

ఈ సినిమాలో టబు సైతం ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. తన సినిమాల్లో ప్రత్యేక పాత్రల్ని తీర్చిదిద్దడంలో త్రివిక్రమ్ శైలే వేరు. మరి సుశాంత్‌ కెరీర్‌ను ‘అల వైకుంఠపురములో’తో త్రివిక్రమ్ ఎలా మలుపు తిప్పుతాడో చూడాలి. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానున్న సంగతి తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English