‘సైరా’ బడ్జెట్‌ను కూడా పెంచి పడేశారుగా..

‘సైరా’ బడ్జెట్‌ను కూడా పెంచి పడేశారుగా..

సాహో సినిమా మొదలైనపుడు దాని బడ్జెట్ రూ.150 కోట్లన్నారు. కానీ మేకింగ్ దశలో ఫిగర్ పెరుగుతూ పోయింది. రూ.200 కోట్లు.. రూ.250 కోట్లు.. రూ.300 కోట్లు అంటూ బడ్జెట్ పెంచి చెబుతూ వెళ్లారు. చివరికి విడుదలకు ముందు స్వయంగా ప్రభాసే ఈ సినిమాకు అయిన ఖర్చు అక్షరాలా రూ.350 కోట్లని ప్రకటించాడు. తీరా సినిమా చూస్తే నిజంగా దీనికి ఇంత ఖర్చయిందా అన్న సందేహాలు కలిగాయి.

సినిమాకు హైప్ తేవడానికి, బయ్యర్లకు ఎక్కువ రేట్లకు అమ్మడం కోసం కావాలనే ఇలా బడ్జెట్ పెంచి చూపించారేమో అన్న సందేహాలు కలిగాయి. భారీ చిత్రాలకు ఇలా బడ్జెట్ పెంచి చూపించడం అన్నది ఒక అలవాటుగా మారిపోతుండటం గమనించవచ్చు. ‘బాహుబలి’ విషయంలో కూడా అదే జరిగింది. ఇదే బాటలో ‘సైరా’ టీం కూడా నడుస్తున్నట్లుగా అనిపిస్తోంది.

‘సైరా’ బడ్జెట్ కూడా ఒకప్పుడు రూ.150 కోట్లని వినిపించింది. తర్వాత రూ.200 కోట్ల సినిమా అంటూ ప్రచారం జరిగింది. కానీ ఈ సినిమా విడుదలకు దగ్గర పడుతుండగా.. బడ్జెట్ రూ.300 కోట్లని ప్రచారం జరుగుతుండటం విశేషం. తాజాగా ‘సైరా’ దర్శకుడు సురేందర్ రెడ్డి ఒక పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో బడ్జెట్ రూ.300 కోట్లు అనే ప్రస్తావన వచ్చింది. సురేందర్ ఆ విషయాన్ని ఖండించకుండా.. అది నిజమే అన్నట్లుగా మాట్లాడాడు.

చిరు కలల ప్రాజెక్టు విషయంలో రామ్ చరణ్ అసలేమీ రాజీ పడలేదని.. ఏం కావాలంటే అది సమకూర్చాడని.. దీంతో బడ్జెట్ అనుకున్న దాని కంటే ఎక్కువ అయిందని.. కానీ ఔట్ పుట్ అద్భుతంగా వచ్చిందని చెప్పాడు సురేందర్. బాహుబలి నిర్మాతల తర్వాత చరణ్ మాత్రమే ఇలా రాజీ లేకుండా సినిమాకు ఖర్చు పెట్టాడని.. ఇలాంటి నిర్మాతను తాను చూడలేదని సురేందర్ పొగిడేశాడు. ఐతే ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ ఇమేజ్, మార్కెట్ అసాధారణంగా పెరిగాయి కాబట్టి అతడిపై రూ.350 కోట్లు పెట్టారన్నా కూడా ఓకేలే అనిపించింది. కానీ చిరంజీవి మీద ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజంగా రూ.300 కోట్లు ఖర్చు చేశారంటే నమ్మొచ్చా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English