సైరాలో రెండే పాట‌లు?

సైరాలో రెండే పాట‌లు?

క‌థ ఎలాంటిదైనా.. జాన‌ర్ ఏదైనా.. దాని స్కేల్ ఎలా ఉన్నా.. ఇండియ‌న్ సినిమాల్లో పాట‌లు మాత్రం త‌ప్ప‌నిస‌రి. అచ్చం హాలీవుడ్ స్ట‌యిల్లో సినిమాలు చేసినా.. పాట‌ల విష‌యంలో మాత్రం రాజీ ప‌డ‌రు. అంత‌ర్జాతీయ స్థాయికి చేరిన బాహుబ‌లిలో కూడా పాట‌ల‌కు ఢోకా లేక‌పోయింది. తాజాగా అదే త‌ర‌హాలో తీసిన సాహోలోనూ నాలుగు పాట‌లు పెట్ట‌డం చూశాం. సినిమాకు పాట‌లు ఏమేర‌కు ఉప‌యోగ‌ప‌డ‌తాయి అన్న‌ది చూడ‌కుండా మ‌న‌వాళ్లు పాట‌లు ఇరికించేస్తారు.

మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిన భారీ చిత్రం సైరా న‌ర‌సింహారెడ్డిలోనూ ఇదే ఒర‌వ‌డి కొన‌సాగిస్తార‌నే అంతా అనుకున్నారు. కానీ ఈ చిత్రంలో రెండు పాట‌లే ఉన్నాయ‌ట‌. ఈ విష‌యాన్ని ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి స్వ‌యంగా వెల్ల‌డించాడు.

సినిమాలో పాట‌లు.. రెహ‌మాన్ స్థానంలో అమిత్ త్రివేదిని సంగీత ద‌ర్శ‌కుడిగా ఎంచుకోవ‌డం.. బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం జూలియస్‌ పేకియమ్‌ను తీసుకోవ‌డం.. ఈ విష‌యాల‌న్నింటిపై సురేంద‌ర్ తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడాడు. ‘‘ముందు సైరా కోసం  సంగీత దర్శకుడిగా ఏ.ఆర్‌. రెహమాన్‌నే అనుకున్నాం. కానీ ఆయ‌న‌ చాలా బిజీ. టైమింగ్స్‌, డేట్స్‌ అడ్జస్ట్‌ కాలేదు. ఒక పాట అర్జెంటుగా షూటింగ్‌ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. భారీ సెట్‌ వేశాం. వేలాదిమంది జూనియర్‌ ఆర్టిస్టులను తీసుకొచ్చాం. రెహమాన్‌గారితో అయితే ఆలస్యమవుతుందనిపించింది. దీంతో సంగీత ద‌ర్శ‌కుడిని మార్చాల్సి వ‌చ్చింది. త‌న బిజీ షెడ్యూల్‌ వల్ల మేం ఆయనతో చేయలేకపోయాం.

త‌ర్వాత‌ రామ్‌చరణ్‌, నేనూ క‌లిసి అమిత్‌ త్రివేదిని తీసుకుందామని అనుకున్నాం. తర్వాత చిరంజీవి గారి దగ్గరికెళ్లాం. మీరు కాన్ఫిడెంట్‌గా ఉంటే గో ఎహెడ్ అన్నారు. సినిమాలో రెండు పాట‌లే ఉన్నాయి. బ్యాగ్రౌండ్‌లో వ‌చ్చే మ‌రో పాట ఉంటుంది. పాట‌ల‌న్నీ సీతారామ‌శాస్త్రే రాశారు. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అమిత్‌ త్రివేదినే చేయాలి. ఆయన‌ ఆరేడు నెలల సమయం అడిగాడు. అప్పటికి మా చేతిలో ఉన్నది మూడు నెలలే. అందుకే జూలియస్‌ పేకియమ్‌ను సంప్రదించాం. తన నేపథ్య సంగీతంతో జూలియస్‌ పేకియమ్‌ ‘సైరా’ను మరో స్థాయికి తీసుకెళ్లాడు’’ అని సురేంద‌ర్ తెలిపాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English