బిందాస్ నాగ్.. సెల‌బ్రెటీల‌కు పాఠం

బిందాస్ నాగ్.. సెల‌బ్రెటీల‌కు పాఠం

సినీ ప‌రిశ్ర‌మ‌లో ఉన్నంత దారుణ‌మైన స‌క్సెస్ రేట్ ఇంకెక్క‌డా క‌నిపించ‌దు. ఏడాదిలో విడుద‌ల‌య్యే సినిమాల్లో ప‌ది శాతం కూడా విజ‌య‌వంతం కావు. కాబ‌ట్టి ఇక్క‌డ జ‌యాప‌జ‌యాల‌కు అతీతంగా ఉండ‌టం చాలా అవ‌స‌రం. కానీ మ‌న సెల‌బ్రెటీల్లో చాలామంది స‌క్సెస్ మ‌త్తును నెత్తికెక్కించుకుంటారు. విజ‌యం సాధించిన‌పుడు పొంగిపోతారు. విఫ‌ల‌మైన‌పుడు కుంగిపోతారు. కానీ ఫ‌లితాల‌తో సంబంధం లేకుండా బిందాస్ లైఫ్ లీడ్ చేసేవాళ్లు చాలా కొద్దిమందే ఉంటారు. అందులో అక్కినేని నాగార్జున ఒక‌రు.

త‌మ సినిమా ఆశించిన ఫ‌లితాన్నందుకోకుంటే కొన్ని రోజులు ఇల్లు దాటి బ‌య‌టికి రాలేని సెల‌బ్రెటీలు చాలామందే ఉన్నారు టాలీవుడ్లో. మ‌హేష్ బాబు సంగ‌తే తీసుకుంటే కొన్ని సినిమాల ఫ‌లితాల‌తో తీవ్ర నిరాశ‌కు గురై.. దాదాపు డిప్రెష‌న్లోకి వెళ్లినట్లు స్వ‌యంగా మ‌హేషే వెల్ల‌డించాడు. ఇలా సినిమా ఆడ‌క‌పోతే నైరాశ్యంలో ప‌డిపోయేవాళ్లు చాలామందే ఉన్నాడు టాలీవుడ్లో. కానీ స‌క్సెస్ రేట్ చాలా త‌క్కువ అయిన సినీ ఇండ‌స్ట్రీలో సినిమా ఆడ‌లేద‌ని చింతిస్తూ కూర్చుంటే బండి న‌డ‌వ‌డం చాలా క‌ష్టం. జ‌యాప‌జ‌యాల్ని ప‌ట్టించుకోకుండా ముందుకు సాగ‌డం చాలా అవ‌స‌రం.

నాగ్‌ను అలా ఎప్పుడైనా చూశారా?
ఈ విష‌యంలో అక్కినేని నాగార్జున‌ను చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఆయ‌న త‌న సినిమా పోయింద‌ని ఎప్పుడూ నిరాశ‌లో కూరుకుపోయి ప‌ని ఆపేయ‌డం, జీవితాన్ని ఆస్వాదించ‌డం మానేయ‌డం ఎప్పుడూ జ‌ర‌గ‌లేదు. నాగ్ హిట్టు కొట్టి చాలా కాలం అయిపోయింది. సోగ్గాడే చిన్నినాయ‌నా త‌ర్వాత ఆయ‌న‌కు పెద్ద హిట్ లేదు. ఊపిరి మంచి సినిమానే కానీ క‌మ‌ర్షియ‌ల్‌గా ఆశించిన ఫ‌లితాన్నివ్వ‌లేదు. ఆ త‌ర్వాత నాగ్ నుంచి అర‌డ‌జ‌ను డిజాస్ట‌ర్లు వ‌చ్చాయి. పోయినేడాది ఆఫీస‌ర్ ఎంత దారుణ ఫ‌లితాన్నందుకుందో తెలిసిందే. ఓం న‌మో వేంక‌టేశాయ సైతం నాగ్ కెరీర్లో అతి పెద్ద డిజాస్ట‌ర్ల‌లో ఒక‌టిగా నిలిచింది.

తాజాగా మ‌న్మ‌థుడు-2తో మ‌రో చేదు అనుభ‌వం ఎదుర్కొన్నాడు. ఇది నాగ్‌కు సొంత చిత్రం కూడా. దీనికి విడుద‌ల‌కు ముందు అమ్మ‌కాలు బాగా జ‌రిగి లాభాలు వ‌చ్చాయి. కానీ బ‌య్య‌ర్ల‌కు భారీ న‌ష్టాలు రావ‌డంతో సెటిల్మెంట్ చేసి నాగ్ డ‌బ్బులు పోగొట్టుకున్న‌ట్లు తెలుస్తోంది. అయితే ఈ రిజ‌ల్ట్ గురించి బాధ ప‌డుతూ కూర్చోకుండా నాగ్ త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా హాలిడే ట్రిప్ ప్లాన్ చేసుకున్నాడు. భార్య‌, ఇద్ద‌రు కొడుకులు, కోడ‌లిని తీసుకుని హాలిడేకు వెళ్లాడు. అక్క‌డ వాళ్లెంత‌గా ఎంజాయ్ చేశారో ఫొటోలు అవీ చూస్తేనే అర్థ‌మ‌వుతోంది.

బిగ్ బాస్‌లో జోష్‌
ఇంకొక‌రైతే సినిమా డిజాస్ట‌ర్ అయితే సంబ‌రాలేంటి.. హాలిడేలేంటి అని ఆగిపోయేవాళ్లేమో. కానీ నాగ్ మాత్రం త‌న‌కు అల‌వాటైన బిందాస్ లైఫ్‌ను కొన‌సాగించాడు. మ‌న్మ‌థుడు-2 డిజాస్ట‌ర్ అని తేలాక కూడా నాగ్ బిగ్ బాస్ షోకు వ‌చ్చి మామూలుగా ఎపిసోడ్స్ లాగించేశాడు. హాలిడే త‌ర్వాత కూడా అదే జోష్‌ కంటిన్యూ అవుతోంది. త‌న సినిమాల ప‌రాజ‌యాల్ని చాలా త్వ‌ర‌గా నిజాయితీగా అంగీక‌రించ‌డం.. త్వ‌ర‌గా మూవ్ అయిపోవ‌డం నాగ్ ప్ర‌త్యేక‌త‌. నాగార్జున‌కు డ‌బ్బుల‌కు లోటా.. ఒక సినిమా పోయింద‌ని బాధ ప‌డ‌టానికి అనుకోవ‌చ్చు. కానీ ఇలాంటి స్థితిలోనే ఉన్న చాలామంది స్టార్లు ఇలా ఎంజాయ్ చేయ‌లేరు. ఈ విష‌యంలో ఆయ‌న్ని చూసి మిగ‌తా సెల‌బ్రెటీలు నేర్చుకోవాల్సింది చాలా ఉంద‌న‌డంలో సందేహం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English