ఏపీ టికెట్ల సమస్యపై బాలయ్య హాట్ కామెంట్స్


ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో ప్రధాన సమస్య అంటే.. ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ల వ్యవహారమే. గత ఏడాది వేసవిలో విడుదలైన పవన్ కళ్యాణ్ సినిమా ‘వకీల్ సాబ్’కు రేట్లను తగ్గించిన ఏపీ ప్రభుత్వం.. ఆ తర్వాత కూడా అవే రేట్లను కొనసాగించడం తెలిసిందే. పెద్ద నగరాలు, పట్టణాల వరకు ఓకే కానీ.. మిగతా చోట్ల ప్రభుత్వం నిర్దేశించిన రేట్లతో థియేటర్లను నడపడం చాలా కష్టమవుతోందన్న అభిప్రాయం ఎగ్జిబిటర్ల నుంచి వ్యక్తమవుతోంది.

ఈ సమస్య పరిష్కారానికి ఇండస్ట్రీ నుంచి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇప్పటిదాకా పరిష్కారం ఏమీ కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీ నుంచి కొన్ని నిరసన గళాలు కూడా వినిపిస్తున్నాయి. నాని సహా కొందరి కామెంట్లు ఎంత చర్చనీయాంశం అయ్యాయో తెలిసిందే. తాజాగా నందమూరి బాలకృష్ణ ఈ విషయమై హాట్ కామెంట్స్ చేశారు.

తన కొత్త చిత్రం ‘అఖండ’ బ్లాక్‌బస్టర్ అయిన నేపథ్యంలో నిర్వహించిన థ్యాంక్స్ మీట్లో పాల్గొన్న బాలయ్యకు ఏపీలో టికెట్ల వ్యవహారానికి సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. దీనికి బదులుగా ఈ విషయంలో సినీ పరిశ్రమ మొత్తం కలిసి కట్టుగా ఉండటం అవసరమని బాలయ్య వ్యాఖ్యానించాడు. టికెట్ ధరలపై చిత్ర పరిశ్రమ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామని అన్నాడు.

ఏపీలో టికెట్ల వ్యవహారంపై సినీ పరిశ్రమ నుంచి సరైన రెప్రజెంటేషన్ లేకపోవడమే సమస్యగా మారిందా అని బాలయ్యను అడిగితే.. అక్కడ వినిపించుకునే నాథుడెక్కడ అని ఎదురు ప్రశ్నించారు బాలయ్య. ఈ వ్యాఖ్యలు వెంటనే సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. మరి బాలయ్య వ్యాఖ్యలపై సినిమాటోగ్రఫీ పేర్ని నాని సహా మంత్రులు, వైకాపా నేతలు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరం. నానీని టార్గెట్ చేసినట్లే బాలయ్యను కూడా టార్గెట్ చేసుకుని మాట్లాడతారేమో చూడాలి.