చంద్ర‌యాన్-2.. అస‌లైన విజ‌యం ఇదే

చంద్ర‌యాన్-2.. అస‌లైన విజ‌యం ఇదే

చంద్ర‌యాన్-2 ప్ర‌యోగం విఫ‌ల‌మైంది. ఎంతో క‌స‌ర‌త్తు చేసి చంద్రుని మీదికి పంపిన‌ విక్ర‌మ్ ల్యాండ‌ర్ గ‌మ్య స్థానానికి అత్యంత చేరువ‌గా వెళ్లి.. కేవ‌లం 2.1 కిలోమీట‌ర్ల దూరంలో ఆగిపోయింది. అక్క‌డి నుంచే సంకేతాలు ఆగిపోయాయి. అది క్రాష్ అయిందా.. లేక అక్క‌డే ఆగిపోయిందా అన్న‌ది తెలియ‌దు.

ఐతే ఈ ప్ర‌యోగ వేళ దేశం స్పందించిన తీరు మాత్రం అమోఘం. ఇప్ప‌టిదాకా ఇస్రో ప్ర‌యోగాలంటే త‌మ‌కు సంబంధం లేని వ్య‌వ‌హారం అన్న‌ట్లుగా ఉండిపోయేవాళ్లు జ‌నం. కానీ చంద్ర‌యాన్-2 ప్ర‌యోగంతో మాత్రం సామాన్య జ‌నం భ‌లేగా క‌నెక్ట‌య్యారు. ముందు నుంచి ఈ ప్ర‌యోగానికి సంబంధించి అప్ డేట్స్ తెలుసుకుంటూ వ‌చ్చారు.

నిన్న‌టి విక్ర‌మ్ ల్యాండ‌ర్ చంద్రుని మీద కాలుమోపే ప్ర‌యోగానికి ఎక్క‌డ లేని హైప్ వ‌చ్చింది. దీన్ని లైవ్ కూడా ఇవ్వ‌డంతో కోట్ల మంది అర్ధ‌రాత్రి దాటాకా టీవీలు, కంప్యూట‌ర్లు, మొబైళ్ల‌కు అతుక్కుపోయారు. ఒక క్రికెట్ మ్యాచ్‌ను చూసిన‌ట్లుగా ఈ ఘ‌ట్టాన్ని వీక్షించారు. ప్ర‌యోగం స‌జావుగా సాగుతున్న వేళ అంద‌రిలోనూ హ‌ర్షాతిరేకాలు వ్య‌క్త‌మ‌య్యాయి. దేశ‌మంతా ఒక్క‌టైంది. ఇంట‌ర్నెట్లో ఎక్క‌డ చూసినా ఇదే చ‌ర్చ‌. కానీ చివ‌రి క్ష‌ణాల్లో స‌మ‌స్య త‌లెత్త‌డంతో అంద‌రిలోనూ ఉత్కంఠ‌, ఆపై నిట్టూర్పు.

ప్ర‌యోగం చివ‌రి ద‌శ‌లో విఫ‌ల‌మైంద‌ని అర్థ‌మైనా ఎవ్వ‌రూ నెగెటివ్‌గా మాట్లాడ‌లేదు. ఎక్క‌డ చూసినా ఇస్రో బృందంపై పొగ‌డ్త‌లే. వాళ్ల‌కు ఓదార్పులే. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ సైతం గొప్ప‌గా స్పందించి అంద‌రి మ‌న‌సులూ గెలిచేశాడు. సైన్స్‌లో ప్ర‌య‌త్నాలుంటాయి త‌ప్ప వైఫ‌ల్యాలుండ‌వంటూ ఆయ‌న గొప్ప మాటే చెప్పాడు. దీనికి ప్ర‌జ‌లు భ‌లే క‌నెక్ట‌య్యారు. ఇస్రో బృందాన్ని ప్ర‌శంస‌ల్లో ముంచెత్తారు. వారికి బాస‌ట‌గా నిలిచారు. చంద్ర‌యాన్-2కు సంబంధించి ఇది అతి పెద్ద విజ‌యంగా చెప్ప‌వ‌చ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English