జెర్సీ గురించి ఎందుకిలా అడుగుతున్నారు?

జెర్సీ గురించి ఎందుకిలా అడుగుతున్నారు?

ఈ ఏడాది వేస‌విలో వ‌చ్చిన అన్ని సినిమాల్లోకి చాలా మంచి టాక్ తెచ్చుకున్న‌ది జెర్సీనే. ఆ మాట‌కొస్తే ఈ ఏడాది మొత్తంలో అత్యుత్త‌మ చిత్రాల్లో ఒక‌టిగానూ జెర్సీ నిలుస్తుంది. నాని కెరీర్లోనూ అది ఒక మైలురాయే. కానీ వేస‌విలో ఈ సినిమా కంటే ముందు మ‌జిలీ విజుద‌లై పెద్ద విజ‌యం సాధించ‌డం.. ప్రేక్ష‌కులు కుటుంబాలు కుటుంబాలుగా థియేట‌ర్ల‌కు వెళ్లి ఆ సినిమా చూసి ఉండ‌టం వ‌ల్ల కావ‌చ్చు.

జెర్సీకి ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో రాలేదు. డివైడ్ టాక్ తెచ్చుకున్న నాని సినిమా ఎంసీఏను ఎగ‌బ‌డి చూసిన జ‌నాలు.. జెర్సీ కోసం అలా ప‌రుగులు పెట్ట‌లేదు. ఇది సీరియ‌స్ సినిమా కావ‌డం వ‌ల్ల కూడా వ‌సూళ్లు ఆశించిన స్థాయిలో లేక‌పోయి ఉండొచ్చు. అందుకే జెర్సీ క‌మ‌ర్షియ‌ల్ రిజ‌ల్ట్ మీద జ‌నాల‌కు కొన్ని సందేహాలున్నాయి.

మీడియా వాళ్లు కూడా అదే సందేహంతో త‌న కొత్త సినిమా గ్యాంగ్ లీడ‌ర్ ప్ర‌మోష‌న్ల కోసం వ‌చ్చిన నానిని జెర్సీ రిజ‌ల్ట్ గురించి అడిగారు. దీనికి నాని ఆశ్చ‌ర్య‌పోతూ స‌మాధానం ఇచ్చాడు. జెర్సీ ఫ‌లితం గురించి అంద‌రూ మ‌ళ్లీ మ‌ళ్లీ ఎందుకు అడుగుతున్నారో త‌న‌కు అర్థం కావ‌డం లేద‌ని నాని అన్నాడు. జెర్సీ సినిమాకు చాలా మంచి టాక్, రివ్యూలు వ‌చ్చాయ‌ని.. క‌మ‌ర్షియ‌ల్‌గా కూడా ఈ చిత్రం మంచి విజ‌యం సాధించింద‌ని నాని చెప్పాడు.

థియేట‌ర్ల‌లో ఈ చిత్రం రూ.30 కోట్ల షేర్ రాబ‌ట్టింద‌ని.. ఇంత‌కంటే సినిమా విజ‌యం గురించి ఏం చెప్పాల‌ని నాని అన్నాడు. జెర్సీ వేర్వేరు భాష‌ల్లోకి రీమేక్ అవుతోంద‌ని.. టీవీల్లో కూడా ఈ చిత్రానికి స్పంద‌న బాగుంద‌ని.. ఏ ర‌కంగా చూసినా ఇది బ్లాక్ బ‌స్ట‌రే అని తీర్మానించాడు నాని. కాబ‌ట్టి ఇక అంద‌రూ జెర్సీ రిజ‌ల్ట్ గురించి మాట్లాడ‌టం ఆపేస్తే బెట‌ర్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English