ఇప్పుడు పవన్ సినిమా వచ్చి ఉంటే..?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని నెలలుగా సినిమాల విషయంలో వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదమవుతోంది. పేదల కోసం టికెట్ల రేట్లు తగ్గిస్తే తప్పా.. కరోనా విస్తరించకుండా థిమేటర్లలో ఆక్యుపెన్సీని తగ్గిస్తే, నైట్ కర్ఫ్యూలు పెట్టి సెకండ్ షోలు రద్దు చేస్తే అభ్యంతరమా అంటూ లాజిక్స్ తీస్తున్నారు మంత్రులు, అధికార పార్టీ నాయకులు. కానీ నిజంగా ఆ ఉద్దేశాలతోనే ఈ చర్యలు చేేపడుతున్నారా అన్నది ప్రశ్న. ఏవైనా నిబంధనలు పెట్టినా, నియంత్రణ చర్యలు చేపట్టినా అవి అందరికీ ఒకేలా ఉండాలి.

ఒక్కొక్కరికి ఒక్కో రకంగా వ్యవహరించకూడదు. ఇక్కడే జగన్ సర్కారు తీరు వివాదాస్పదం అవుతోంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండేళ్ల పాటు టికెట్ల రేట్లు, థియేటర్లకు సంబంధించిన సమస్యల్నిఏమీ పట్టించుకోలేదు. ఆ టైంలో పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరంగా ఉన్నాడు. కానీ ఆయన రీఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ రిలీజైనపుడే.. సరిగ్గా విడుదల రోజే టికెట్ల రేట్ల మీద ఉక్కు పాదం మోపారు.

ఆ తర్వాత ఇది ఎంత పెద్ద సమస్యగా మారిందో తెలిసిందే. పవన్ కొత్త చిత్రం ‘భీమ్లా నాయక్’ సంక్రాంతికి వస్తుందన్న అంచనాల నేపథ్యంలో టికెట్ల రేట్ల అంశాన్ని ఒక పట్టాన తేల్చకుండా నాన్చుతున్నారనే అభిప్రాయం బలంగా వ్యక్తమైంది. పవన్ సంగతలా ఉంచితే.. సినీ పరిశ్రమలో ఎక్కువమంది చంద్రబాబు మద్దతుదారులు, జగన్ వ్యతిరేకులన్న అభిప్రాయం వైసీపీ నాయకుల్లో బలంగా ఉందన్నది స్పష్టం.

అలాగే ఇండస్ట్రీలో కమ్మ కులస్థులదే ఆధిపత్యం అన్న ఉద్దేశంతోనూ ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే ఏపీ సర్కారు తాజాగా వ్యవహరించిన తీరు చూస్తే.. పక్షపాత ధోరణి స్పష్టంగా తెలిసిపోతోంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీలో థియేటర్ల ఆక్యుపెన్సీని 50 శాతానికి తగ్గించాలని, నైట్ కర్ఫ్యూ పెట్టి సెకండ్ షోలు రద్దు చేయాలని నిర్ణయించారు ముందు. కానీ కొన్ని రోజులకే కథ మారిపోయింది. ఈ నిర్ణయాలను వాయిదావేశారు. సంక్రాంతి సీజన్ తర్వాతే ఈ మేరకు నిబంధనలు అమలు చేయాలని నిర్ణయించారు.

ఇది కచ్చితంగా జగన్ మిత్రుడైన నాగార్జున కోసం మారిన నిర్ణయమే అని.. ‘బంగార్రాజు’కు ఇబ్బంది తలెత్తకుండా నిర్ణయాన్ని మార్చారని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ పవన్ సినిమా ‘భీమ్లా నాయక్’ సంక్రాంతికి రిలీజై ఉంటే ఇలా మినహాయింపు ఇచ్చేవారా అన్న ప్రశ్న తలెత్తుతోంది. కచ్చితంగా ఆక్యుపెన్సీ తగ్గించి, నైట్ షోలు రద్దు చేయించడమే కాక.. అన్ని  రకాలుగా ఆ చిత్రాన్ని ఇబ్బంది పెట్టడానికి చూసేవారని.. ఇలా ఒక్కొక్కరికి ఒక్కోలా వ్యవహరిస్తూ పక్షపాతం ప్రదర్శించడం ఏం పద్ధతని ప్రశ్నలు సంధిస్తున్నారు నెటిజన్లు.