సమీక్ష: జోడీ - ఫ్లాప్ సినిమాలతో జోడీ

సమీక్ష: జోడీ - ఫ్లాప్ సినిమాలతో జోడీ

నటీనటులు: ఆది సాయి కుమార్‌, శ్రద్ధా శ్రీనాథ్‌, నరేష్‌, వెన్నెల కిశోర్‌, సత్య
సంగీతం: ఫణి కల్యాణ్‌
నిర్మాత: పద్మజ, శ్రీ వెంకటేష్ గుర్రం
దర్శకత్వం: విశ్వనాథ్‌ అరిగెల

టాలీవుడ్ లోకి వచ్చే కొత్త తరం రెండు రకాలుగా వుంటుంది.  కొత్త కొత్త అయిడియాలతో, ఆలోచనలతో కొత్త జోనర్ సినిమాలు చూపించే వాళ్లు కొందరు. పాతచింతకాయ పచ్చడినే కొత్త ఫ్యాకింగ్ తో చూపించేస్తే చాలు అనుకునేవారు మరి కొందరు. సరైన సక్సెస్ లేక అల్లాడుతున్న హీరో ఆది సాయి కుమార్, హీరోయిన్ శ్రద్ధ శ్రీనాద్ తో కలిసి చేసిన జోడి సినిమా ఈ రెండో కోవకు చెందిన సినిమా.

క్రమశిక్షణ కలిగిన కుటుంబం, దాని మీనింగ్ తెలియని వ్యక్తి సారథ్యంలోని కుటుంబం. ఈ రెండు కుటుంబాలకు చెందిన అమ్మాయి, అబ్బాయి ప్రేమికులుగా మారడం, అమ్మాయి తండ్రి అభ్యంతరం. దానికి అబ్బాయి తండ్రే కారణం కావడం, దాంతో అబ్బాయి తన ప్రేమను నిలబెట్టుకోవడానికి ఏం చేసాడు.  ఎన్నిసార్లు ఇలాంటి లైన్ వినలేదు. ఎన్నిసార్లు ఇలాంటి సినిమాలు చూడలేదు?

ఇలా స్టోరీ లైన్ చెప్పగానే, ఏ హీరో అయినా, వచ్చిన కొత్త డైరక్టర్ కు మాంచి కాఫీ ఇచ్చి, థాంక్స్ చెప్పి పంపేస్తాడు. కానీ ఆది సాయిుకుమార్ పరిస్థితి వేరు. వచ్చిన సినిమానే ఒప్పుకోవాలి. అందుకే ఓకె అనాల్సి వచ్చిందేమో? దర్శకుడు విశ్వనాధ్ అరిగెల తీసిన అరిగిపోయిన కథ ఏంటంటే..

కపిల్ (ఆది సాయికుమార్) తండ్రి (నరేష్) ఓ క్రికెట్ బెట్టింగ్ బంగార్రాజు. అప్పులు చేసి మరీ క్రికెట్ బెట్టింగ్ లు ఆడేస్తుంటాడు. ఆఖరికి ఊరు వదిలి వేరే ఊరు వచ్చేస్తాడు. కొడుకు పెద్దయి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అవుతాడు. ఓ మాంచి ఫ్యామిలీకి చెందిన కాంచనమాల (శ్రద్ధ) ను ప్రేమిస్తాడు. కానీ ఆ అమ్మాయి బాబాయ్ రాజు మాత్రం ఒప్పుకోడు. దానికి కారణత కపిల్ తండ్రి బెట్టింగ్ ల కారణంగా అతను తన సోదరుడిని కోల్పోవడమే. ఇలాంటి పరిస్థితుల్లో కపిల్ ఏం చేసి, తన ప్రేమ నిలబెట్టుకున్నాడు.

సినిమా ప్రారంభమైన తరువాత వచ్చే వెరీ ఫస్ట్ ఓపెనింగ్ షాట్ దగ్గర నుంచే దర్శకుడు తనకు తాను ప్రామిస్ చేసుకున్నాడు. కొత్తగా ఒక్క సీన్ కూడా తీయను అని డిసైడ్ అయిపోయాడు అని ప్రేక్షకుడికి అర్థం అయిపోతుంది. ఆ తరువాత అసలు కథ మొదలు పెట్టడానికి ఇచ్చే ఉపోద్ఘాతంతోనే ప్రేక్షకుడి బుర్ర తిరిగిపోతుంది. ఇక సినిమాలో వెళ్లే మూడ్, ఉత్సాహం అన్నీ నీరుగారిపోతాయి. అలా కళ్లు అప్పగించి సినిమా చూస్తుంటే, కథ గానీ, కథనం గానీ, టేకింగ్ గానీ ఏవీ ఒక్క చోట కొత్తదనం అన్నది కనిపించదు. తీసిన ప్రతి సీన్, చూసే ప్రతి సీన్ ఏదో ఒక సినిమాను గుర్తు చేస్తూనే వుంటుంది. దాంతో అస్సలు సినిమా చూడాలనే ఉత్సాహం కలగాలన్నా కలగదు.

హీరో హీరోయిన్ల ప్రేమకు ఎక్కడో ఒక చోట బ్రేక్ పడుతుందని, ఏదో ట్విస్ట్ లేకుండా ఏ డైరక్టర్ ఇంటర్వెల్ బ్యాంగ్ వేయరు అని ప్రేక్షకుడికి తెలుసు కాబట్టి, ఆ వచ్చే ఇంతోటి ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా ఏమీ ఆకట్టుకోదు. షాకింగ్ అనిపించదు. అక్కడితో తొలిసగం పూర్తి అవుతుంది. ద్వితీయార్థం మొదలైన తరువాత కథలో లాజిక్ కూడా ఎగిరిపోతుంది. బంగారం ఉద్యోగం వదిలి, హీరోయిన్ బాబాయ్ ను ఇంప్రెస్ చేయడం కోసం హీరో పడే పాట్లు చూసి నవ్వు రాదు కదా, అయ్యో, తెలుగు సినిమా అనిపిస్తుంది.  ఆ క్రమంలో వచ్చే సీన్లు ప్రతి ఒక్కదానికీ ఓ సినిమాను రిఫరెన్స్ గా ఇచ్చేయవచ్చు. అలా ఆఖరికి సినిమా, సినిమాటిక్ గా ముగుస్తుంది.

ఇలాంటి కథను సినిమా తీసి హిట్ చేసి, టాలీవుడ్ లో డైరక్టర్ గా ఫిక్స్ కావాలని అనుకున్న డైరక్టర్ కు, నాలుగు డబ్బులు చేసుకుందాం అనుకున్న నిర్మాతలను మెచ్చుకొవాలి. ఇది అమాయకత్వమా? తెలియని తనమా? అన్నది వారే డిసైడ్ చేసుకోవాలి.

ఇలాంటి సినిమాకు సాంకేతిక విలువలు కూడా అంతంత మాత్రంగానే వున్నాయి. సినిమాలో ఓ పాటకు, అక్కడక్కడ నేపథ్యంగా వాడేందుకు తీసుకున్న ట్యూన్ మదరాసుపట్టణంలో సాంగ్ ను గుర్తు చేస్తుంది. మిగిలిన పాటలు కూడా అలాగే మిగిలాయి. సంభాషణలు ఆకట్టుకోవు.

సత్య, వెన్నెల కిషోర్ కాస్త కామెడీ చేయడానికి ట్రయ్ చేసారు. ఎప్పుడయినా పొరపాటున నవ్వు వచ్చినా, అది వాళ్ల ఫేస్ ఫీలింగ్స్ వల్ల, మాడ్యులేషన్ వల్ల తప్ప, డైలాగ్ పవర్ నో, సీన్ ఇంటెన్సిటీనో కాదని మనవి. సాయి ఆదికుమార్ తన వరకు తాను బాగానే చేసాడు. కానీ ఏం లాభం? సినిమాలో విషయం లేనపుడు. శ్రద్ధ శ్రీనాధ్ కు చేయడానికి పెద్దగా ఏమీ లేదు. చూడడానికి తప్ప.

మొత్తం మీద వారం వారం వచ్చిపోయే అనేకానేక సినిమాల్లో ఒకటిగా మిగుల్తుంది ఇది కూడా

లాస్ట్ పంచ్: ఫ్లాప్ సినిమాలతో జోడీ

రేటింగ్-1.5/5

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English