కొసరు క్లిక్ అయింది.. అస‌లు పోయింది

కొసరు క్లిక్ అయింది.. అస‌లు పోయింది

శ్రీ విష్ణు అనే పేరు ఇండ‌స్ట్రీలో వినిపించేలా చేసింది నారా రోహిత్. అత‌ను ముందు చిన్నా చిత‌కా పాత్ర‌లే చేశాడు. ప్ర‌తినిధి, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి, జ‌యమ్ము నిశ్చ‌య‌మ్మురా లాంటి చిత్రాల్లో క్యారెక్ట‌ర్ రోల్స్‌లో క‌నిపించాడు. ఆ త‌ర్వాత హీరో అయ్యాడు. అత‌డి ప్ర‌తి ద‌శ‌లోనూ స‌పోర్టుగా నిలిచింది రోహితే. వీళ్లిద్ద‌రూ చాలా ఏళ్ల నుంచి స్నేహితులు.

ఐతే రోహిత్‌కు మంచి బ్యాగ్రౌండ్ ఉండ‌టంతో అవ‌కాశాలు వెల్లువెత్తాయి. ఒక ద‌శ‌లో ఒకేసారి ఏడెనిమిది సినిమాల్లో న‌టిస్తూ బిజీగా ఉన్నాడు రోహిత్. కొన్ని చిత్రాల్లో విష్ణుకు అవ‌కాశాలు ఇప్పించ‌డ‌మే కాక‌.. సొంతంగా నిర్మాణ సంస్థ కూడా పెట్టి అత‌డిని హీరోగా నిల‌బెట్టే ప్ర‌య‌త్నం చేశాడు. అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు అలా నిర్మించిన చిత్ర‌మే. ఆ సినిమా విష్ణుకు చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది.

విష్ణుకు వేరే చిత్రాల్లో అవ‌కాశాలు రావ‌డంలో కూడా రోహిత్ పాత్ర ఉంద‌ని అంటారు. కానీ రోహిత్ ఎంతో శ్ర‌ద్ధ పెట్టి త‌న మిత్రుడిని హీరోగా నిల‌బెట్టాడు కానీ.. అత‌ను క్లిక్ అయ్యే స‌మ‌యానికి త‌నే ఇండ‌స్ట్రీలో లేకుండా పోయాడు. ఫ‌లితాల‌తో సంబంధం లేకుండా ఒక‌ప్పుడు వ‌రుస‌గా సినిమాలు చేసిన రోహిత్.. ఇప్పుడు ఖాళీ అయిపోయాడు. వ‌రుస ఫ్లాపులు అత‌డిని వెన‌క్కి లాగేశాయి.

ఆల్రెడీ క‌మిటైన సినిమాలు ఆగిపోయాయి. బాణం ఫేమ్ చైత‌న్య దంతులూరి ద‌ర్శ‌క‌త్వంలో అనుకున్న అన‌గ‌న‌గా ద‌క్షిణాదిలో సినిమా బ‌డ్జెట్ స‌మ‌స్య‌ల‌తో ముందుకు క‌ద‌ల్లేదు. వేరే సినిమాలకూ బ్రేక్ ప‌డింది. ఇండ‌స్ట్రీలో రోహిత్ పేరు వినిపించే చాలా కాలం అయింది. గ‌త ఏడాది వీర భోగ వ‌సంత‌రాయ‌లు డిజాస్ట‌ర్ త‌ర్వాత రోహిత్ నుంచి సినిమానే రాలేదు.

మ‌రోవైపు బ్రోచేవారెవురా మంచి హిట్ట‌వ‌డంతో విష్ణుకు క్రేజ్ పెరిగింది. తిప్ప‌రా మీసం టీజ‌ర్‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అత‌ను బాగా బిజీ అయ్యేట్లే క‌నిపిస్తున్నాడు. మొత్తానికి విష్ణు క్లిక్ అవుతున్న ద‌శ‌లో.. ఒక‌ప్పుడు హీరోను నిల‌బెట్టేందుకు క‌ష్ట‌ప‌డ్డ రోహిత్ ఇండ‌స్ట్రీ నుంచే అంత‌ర్ధాన‌మ‌య్యే ప‌రిస్థితి రావ‌డం విచార‌క‌రం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English