క‌రోనా క‌రుణిస్తే రికార్డు బ‌ద్ద‌లే

ఈ సంక్రాంతికి ముందు అనుకున్న సినిమాల‌ లైన‌ప్ వేరు. చివ‌రికి చూడ‌బోతున్న లైన‌ప్ వేరు. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ లాంటి భారీ చిత్రాల మ‌ధ్య బంగార్రాజు ఓ చిన్న సినిమాలా వ‌స్తుంద‌నుకుంటే.. ఇప్పుడు అదే ఓ పెద్ద సినిమాలా సంక్రాంతి బ‌రిలోకి దిగుతోంది. దీంతో పాటుగా రౌడీ బాయ్స్, హీరో లాంటి చిన్న సినిమాలు కూడా పండక్కి ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్నాయి. ఐతే ప్రేక్ష‌కుల దృష్టి ప్ర‌ధానంగా బంగార్రాజు మీదే ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు.

ప్ర‌స్తుతం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ప‌రిస్థితులు ఏమంత అనుకూలంగా లేక‌పోయినా స‌రే.. ఈ చిత్రానికి స‌రైన పోటీ లేక‌పోవ‌డం బాగా క‌లిసొచ్చేలా ఉంది. క‌రోనా కాస్త క‌రుణిస్తే నాగార్జున కెరీర్లోనే బంగార్రాజు హైయెస్ట్ గ్రాస‌ర్‌గా నిల‌వ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. 2016లో నాన్న‌కు ప్రేమ‌తో, డిక్టేట‌ర్, ఎక్స్‌ప్రెస్ రాజా లాంటి మూడు క్రేజీ సినిమాల పోటీని త‌ట్టుకుని కూడా సోగ్గాడే చిన్నినాయ‌నా సంక్రాంతి విన్న‌ర్‌గా నిలిచింది. ఊహించ‌ని రీతిలో ఆడేసిన ఆ సినిమా నాగ్ కెరీర్లో తొలి 50 కోట్ల షేర్ మూవీగా నిలిచింది. కానీ ఈ ఊపును త‌ర్వాత ఆయ‌న కొన‌సాగించ‌లేక‌పోయాడు.

మార్కెట్ అంత‌కంత‌కూ ప‌డిపోయింది. నాగ్ చివ‌రి సినిమా వైల్డ్ డాగ్‌కు పాజిటివ్ టాక్ వ‌చ్చినా స‌రే.. ప‌ది కోట్ల షేర్ కూడా రాని ప‌రిస్థితి. ఐతే బంగార్రాజుతో క‌థ మారుతుంద‌ని నాగ్ ధీమాగా ఉన్నాడు. నాగ్ కెరీర్లోనే రికార్డు స్థాయిలో ఈ సినిమాకు స్క్రీన్లు ద‌క్క‌బోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్ష‌కులు సంక్రాంతి టైంలో క‌చ్చితంగా సినిమా చూడాల‌నుకుంటారు. అలా కోరుకునే ప్ర‌తి ప్రేక్ష‌కుడి ఛాయిస్ ఇప్పుడు బంగార్రాజునే.

ఫ్యామిలీస్ ఈ సినిమా థియేట‌ర్ల‌కు పోటెత్తే అవ‌కాశ‌ముంది. కాక‌పోతే క‌రోనా కేసులు అంత‌కంత‌కూ పెరుగుతుండ‌ట‌మే ఆందోళ‌న రేకెత్తిస్తోంది. సినిమా రిలీజ‌య్యే టైంకి ప‌రిస్థితి అదుపు త‌ప్పితే.. మ‌ధ్య‌లో థియేట‌ర్ల‌ను మూత వేయించాల్సి వ‌స్తే.. ఆంక్ష‌లు పెరిగితే మాత్రం బంగార్రాజుకు క‌ష్టం అవుతుంది. అలా కాకుండా ఓ వారం రోజులు ప‌రిస్థితులు స‌హ‌క‌రిస్తే మాత్రం నాగ్ కెరీర్ రికార్డు కొట్ట‌డం లాంఛ‌న‌మే.