బ‌న్నీవాసు-సునీత గొడ‌వ‌లో మ‌రో కోణం

బ‌న్నీవాసు-సునీత గొడ‌వ‌లో మ‌రో కోణం

తెలుగు ఇండ‌స్ట్రీలో ఇప్పుడో చిన్న వివాదం అన‌వ‌స‌రంగా పెద్ద‌ద‌వుతోంది. సునీత బోయ అనే జూనియ‌ర్ ఆర్టిస్టు.. మెగా నిర్మాత బ‌న్నీ వాసు, అత‌డి టీం త‌నకు అవ‌కాశాలిస్తార‌ని చెప్పి మోసం చేశారంటూ పెద్ద గొడవ చేయ‌డం సంచ‌లనం రేపిన సంగ‌తి తెలిసిందే. ఫిలిం ఛాంబ‌ర్ ఎదుట‌ గేటుకు ఇనుప గొలుసుల‌తో క‌ట్టేసుకున్న ఘ‌ట‌న చ‌ర్చ‌నీయాంశం అయింది. దీని కంటే ముందు సునీత‌.. గీతా ఆర్ట్స్ ఆఫీస్ ముందు గొడ‌వ చేసిన‌ట్లు.. వాళ్ల ఆఫీసులోకి వెళ్లి క‌త్తితో పొడుచుకుని చ‌చ్చిపోతాన‌ని కూడా బెదిరించిన‌ట్లు ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ఐతే ఈ విష‌యంపై స్పందించ‌డం త‌న స్థాయికి త‌గ‌ద‌ని బ‌న్నీ వాసు ముందు సైలెంటుగా ఉన్నాడు.

కానీ విష‌యం పెద్ద‌దవుతుండ‌టంతో క్లారిటీ ఇవ్వ‌డం కోసం ఒక వీడియో బైట్ రిలీజ్ చేశాడు. సునీత విష‌యంలో మొద‌ట్నుంచి ఏం జ‌రిగిందో బ‌న్నీ వాసు చాలా వివ‌రంగానే చెప్పాడు. చాలా కూల్‌గానే విష‌య‌మంతా చెప్పుకొచ్చాడు బ‌న్నీ వాసు. వీడియో వ‌ర‌కు చూస్తే ఆయ‌న వెర్ష‌న్ క‌న్విన్సింగ్‌గానే అనిపిస్తోంది. సునీతకు బ్యాలెన్స్ లేద‌న్న విష‌యం మాత్రం ఒప్పుకోవాల్సిందే. ఇలా గొడ‌వ చేస్తే ఎవ‌రు మాత్రం అవ‌కాశాలిస్తారు? త‌న త‌ల్లిదండ్రుల్నే తెచ్చి గీతా ఆఫీస్ ద‌గ్గ‌ర వ‌దిలిపెట్టి వెళ్లిపోవ‌డం అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి?

ఐతే వాసు చెబుతున్న‌ది చూస్తే.. ఊరూ పేరూ లేని సునీత‌ను అస‌లు ఇంత కాలం ఎలా టాల‌రేట్ చేశారు.. ఆమె విష‌యంలో ఇంత సంయ‌మ‌నం ఎలా పాటించారు అన్న సందేహాలు క‌లుగుతున్నాయి. బ‌న్నీ వాసు స్థాయికి సునీత అనే అమ్మాయికి అవ‌కాశాలిస్తాన‌ని చెప్పి మోసం చేయాల్సిన అవ‌స‌రం ఉన్న‌ట్లు కనిపించ‌దు. ఇక్క‌డ విష‌యం వేరే ఉంది అన్న‌ది ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం.

సునీత గ‌తంలో మెగా ఫ్యామిలీకి బ‌ద్ద శ‌త్రువుగా పేరున్న క‌త్తి మ‌హేష్‌ను టార్గెట్ చేసింది. అత‌డిపై తీవ్ర ఆరోప‌ణ‌లు చేసింది. అత‌ను త‌న‌ను వాడుకున్న‌ట్లు ఆరోపించింది. ఈ విష‌య‌మై ఆమె టీవీ ఛానెల్ చ‌ర్చ‌లో పాల్గొంటూ క‌త్తి మీద చేయి కూడా చేసుకుంది. ఐతే త‌న‌పై చేసిన ఆరోప‌ణ‌ల‌పై రూ.50 ల‌క్ష‌ల‌కు క‌త్తి ప‌రువు న‌ష్టం దావా వేయ‌డంతో ఆమె బెదిరిపోయి ఏడుస్తూ ఒక వీడియో పెట్టింది. ఆ వ్య‌వ‌హారం అక్క‌డితో స‌ద్దుమ‌ణిగింది.

ఐతే అప్పుడు సునీత‌ను కొంద‌రు కావాల‌నే క‌త్తి మీదికి ప్ర‌యోగించార‌న్న ఆరోప‌ణ‌లున్నాయి. అందులో బ‌న్నీ వాసు పాత్ర ఏమైనా ఉందా? లేక ప‌వ‌న్‌ను టార్గెట్ చేస్తున్న క‌త్తిని ఇబ్బంది పెట్టినందుకు ఆమెపై సాఫ్ట్ కార్న‌ర్ ఏర్ప‌డి బ‌న్నీ వాసు ఆమెకు స‌పోర్ట్ చేయ‌బోయాడా? సునీత జ‌న‌సేన త‌ర‌ఫున ప‌ని చేసిన విష‌యం కూడా బ‌న్నీ వాసు మాట‌ల్లో బ‌య‌ట‌ప‌డింది. దీన్ని బ‌ట్టి చూస్తే క‌త్తితో సునీత గొడ‌వకు సంబంధించి ఇప్పుడు కొత్త సందేహాలు త‌లెత్తుతున్నాయి. మొత్తానికి వ్య‌వ‌హారం అయితే కొంచెం తేడాగానే అనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English