ప‌దేళ్లలో చైతూ.. ఏం సాధించాడు?

ప‌దేళ్లలో చైతూ.. ఏం సాధించాడు?

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో అతిపెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒక‌టి. ఆ కుటుంబం నుంచి వ‌చ్చిన మూడో త‌రం క‌థానాయ‌కుడు అక్కినేని నాగ‌చైత‌న్య‌. అత‌ను ఏఎన్నార్‌కు మాత్ర‌మే కాదు.. రామానాయుడు అనే మ‌రో దిగ్గ‌జానికి కూడా మ‌న‌వ‌డే. తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో తిరుగులేని ఆధిప‌త్యం చ‌లాయిస్తున్న రెండు పెద్ద కుటుంబాల వార‌సుడు చైతూ. అత‌డి అరంగేట్రానికి ముందు జ‌రిగిన హ‌డావుడి ప్ర‌కారం చూస్తే అత‌ను చాలా పెద్ద స్టార్ అవుతాడ‌నుకున్నారు. కానీ చైతూ ఆ అంచ‌నాల్ని అందుకోలేక‌పోయిన మాట వాస్త‌వం. కానీ ప‌దేళ్ల కెరీర్ పూర్తి చేసుకున్న చైతూ తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో న‌టుడిగా, వ్య‌క్తిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న మాట వాస్త‌వం.

చైతూ సినీ ప్ర‌స్థానంలో అప్పుడే పదేళ్లు పూర్తి కావ‌డం విశేషం. ఏఎన్నార్ న‌ట వార‌స‌త్వాన్ని నిల‌బెడుతూ అక్కినేని నాగార్జున త‌న తొలి ప‌దేళ్ల‌లో పెద్ద స్టార్ హీరోగా ఎదిగాడు. ఆ ప‌దేళ్ల‌లో అనేక ప్ర‌యోగాలు చేశాడు. శివ‌, గీతాంజలి లాంటి సినిమాల‌తో తిరుగులేని ఇమేజ్ సంపాదించాడు. ఐతే నాగార్జున‌తో పోలిస్తే నాగ‌చైత‌న్య ద‌శాబ్ద కాలంలో భారీ విజ‌యాలు, ఇమేజ్ సంపాదించుకోలేని మాట వాస్త‌వం. అక్కినేని వారితో పాటు ద‌గ్గుబాటి కుటంబం అండ కూడా ఉన్న జోష్ సినిమాతో స‌క్సెస్ ఫుల్ ఎంట్రీ ఇచ్చి ఉంటే ఈ రోజు అత‌డి రేంజి మ‌రోలా ఉండేదేమో. కానీ తొలి సినిమా డిజాస్ట‌ర్ కావ‌డంతో చైతూ దారి మారింది. ఏమాయ చేసావె లాంటి క్లాస్ ల‌వ్ స్టోరీతో తొలి విజ‌యం అందుకోవ‌డంతో అత‌ను ల‌వ‌ర్ బాయ్ ఇమేజ్ వ‌చ్చింది కానీ.. మాస్ ఇమేజ్ చేకూర‌లేదు.

మ‌ధ్య మ‌ధ్య‌లో మాస్ ఇమేజ్ కోసం ఎంత‌గా ప్ర‌య‌త్నించినా.. ఎదురు దెబ్బ‌లు త‌గిలాయే త‌ప్ప చైతూ ఇమేజ్ మార‌లేదు. కానీ ల‌వ్ స్టోరీల‌తో పెద్ద విజ‌యాలు అందుకోవ‌డ‌మే కాదు.. న‌టుడిగానూ పేరు సంపాదించాడ‌తను. 100 ప‌ర్సంట్ ల‌వ్, మ‌నం, ప్రేమ‌మ్, రారండోయ్ వేడుక చూద్దాం, తాజాగా మ‌జిలీ లాంటి మ‌ర‌పురాని విజ‌యాలున్నాయి చైతూ కెరీర్లో. ఈ సినిమాల‌న్నీ న‌టుడిగానూ చైతూకు మంచి పేరు తెచ్చాయి. మ‌జిలీ అత‌డిని న‌టుడిగా మ‌రో మెట్టు ఎక్కించింది. ఐతే ఒక న‌టుడిగా కంటే వ్య‌క్తిగా చైతూ సంపాదించిన పేరు ఎక్కువ అని చెప్పొచ్చు.

ఫిలిం ఇండ‌స్ట్రీ అంటేనే ఎక్క‌డ లేని అహంకారం, హిపోక్ర‌సీ క‌నిపిస్తుంది. కానీ చైతూలో ఆ ల‌క్ష‌ణాలు అస్స‌లు క‌నిపించ‌వు. వ్య‌క్తిగ‌తంగా చాలా సింపుల్‌గా క‌నిపిస్తాడ‌త‌ను. బిల్డ‌ప్పులుండ‌వు. పెద్ద ఫ్యామిలీకి చెందిన వాడిన‌న్న డాబు క‌నిపించ‌దు. సోష‌ల్ మీడియాలో డ‌బ్బాలు కొట్టించుకోవ‌డం క‌నిపించ‌దు. అత‌డి వ్య‌క్తిత్వం ఇండ‌స్ట్రీలో అంద‌రికీ ఇష్టుడిగా మార్చింది. ప్రేక్ష‌కుల్లో కూడా అత‌డి ప‌ట్ల ఒక సానుకూల అభిప్రాయం క‌ల‌గ‌డానికి చైతూ వ్య‌క్తిత్వం ముఖ్య కార‌ణం అని చెప్పొచ్చు. న‌టుడి అక్కినేని, ద‌గ్గుబాటి కుటుంబాలు ఆశించిన స్థాయిలో పెద్ద స్టార్ అయిపోకున్నా.. ఉన్నంత‌లో కెరీర్ బాగానే ఉండ‌టం, న‌టుడిగా పేరు తెచ్చుకోవ‌డం, మంచి వ్య‌క్తిగా గుర్తింపు పొంద‌డం ఈ ప‌దేళ్ల కెరీర్లో చైతూ సాధించిన విజ‌యాలు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English