వెంటిలేట‌ర్ మీదికి సాహో?

వెంటిలేట‌ర్ మీదికి సాహో?

ఒక మ‌నిషి ఆసుప‌త్రిలో వెంటిలేట‌ర్ మీదికి వ‌చ్చాడంటే చివ‌రి ద‌శ‌లో ఉన్న‌ట్లు అర్థం. ఇప్పుడు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర‌ సాహో ప‌రిస్థితి ఇలాగే ఉంది. మొన్న‌టిదాకా రోజూ ప‌దుల కోట్ల‌లో వ‌సూళ్లు రాబ‌ట్టిన ఈ చిత్రం ఇప్పుడు ద‌య‌నీయ స్థితికి చేరుకుంది. ఒక్కో రాష్ట్రంలో కోట్ల నుంచి ల‌క్ష‌ల్లోకి వ‌చ్చేసింది షేర్.

తెలంగాణ‌లో తొలి రోజే రూ.10 కోట్ల దాకా షేర్ సాధించి.. ఆ తర్వాతి మూడు రోజుల్లోనూ భారీగా వ‌సూళ్లు రాబ‌ట్టిన సాహో.. ఐదో రోజు ఒక్క‌సారిగా డ్రాప్ అయి 1.3 కోట్ల షేర్‌కు ప‌డిపోయింది. ఆరో రోజు డ్రాప్ మరీ దారుణం. రాష్ట్ర వ్యాప్తంగా వ‌సూలైన షేర్ కేవ‌లం రూ.61 ల‌క్ష‌లు. సాహో ప‌రిస్థితి బాగుంద‌నుకున్న తెలంగాణ‌లో ఇలాంటి షేర్ వ‌చ్చిందంటే.. వీకెండ్లోనే వీక్ అయిన ఆంధ్రా, రాయ‌ల‌సీమ‌ల్లో ప‌రిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేయొచ్చు. అక్క‌డ ఆరో రోజు అటు ఇటుగా ఏపీ అంత‌టా క‌లిపి కోటి రూపాయ‌ల షేర్ వ‌చ్చింది. ఐదో రోజుతో పోలిస్తే వ‌సూళ్లు 60 శాతం డ్రాప్ అయ్యాయి. గురువారం షేర్ మ‌రీ నామ‌మాత్రంగా ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

త‌మిళ‌నాడు, కేర‌ళ‌ల్లో అయితే సాహో థియేట్రికల్ ర‌న్ దాదాపుగా ముగిసిన‌ట్లే ఉంది. క‌ర్ణాట‌క‌లో కూడా ఆరో రోజు వ‌సూళ్ల‌లో మేజ‌ర్ డ్రాప్ క‌నిపించింది. యుఎస్‌లో కూడా సినిమా ప‌రిస్థితి ఏమీ బాగా లేదు. వీకెండ్ వ‌స్తే సినిమా కొంచెం పుంజుకుంటుందేమో చూడాలి.

ఈ వారం చెప్పుకోద‌గ్గ కొత్త సినిమాలేవీ రిలీజ్ కాక‌పోవ‌డం కాస్త ఊర‌ట‌నిచ్చే విష‌యం. ఐతే ప్రేక్ష‌కులు సాహో త‌ప్ప ఛాయిస్ లేద‌ని ఆ సినిమానే చూస్తారా.. లేక ఏ సినిమా వ‌ద్ద‌ని ఊరుకుంటారా అన్న‌ది చూడాలి. వీకెండ్లో ఎంత పుంజుకున్నా సినిమా బ్రేక్ ఈవెన్‌కు ద‌గ్గ‌రగా కూడా వెళ్లే ప‌రిస్థితి అయితే కనిపించ‌డం లేద‌న్న‌ది స్ప‌ష్టం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English