ధనుష్‌ వెర్సస్ ప్రొడ్యూసర్స్.. ముదురుతున్న గొడవ

ధనుష్‌ వెర్సస్ ప్రొడ్యూసర్స్.. ముదురుతున్న గొడవ

తమిళంలో స్వశక్తితో పెద్ద హీరోగా ఎదిగిన నటుడు ధనుష్. ఐతే అతడి కెరీర్లో వివాదాలు లేకపోలేదు. కొన్నిసార్లు స్వయంగా.. కొన్నిసార్లు తన ప్రమేయం లేకుండా అతను వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటాడు. నిర్మాతలు, బయ్యర్లతో అతడికి చాలాసార్లు పేచీ నడిచింది. డబ్బుల విషయంలో మరీ కఠినంగా ఉంటాడనే పేరు ధనుష్‌కు ఉంది.

‘కొలవెరి’ పాటతో వచ్చిన క్రేజ్‌ను క్యాష్ చేసుకుంటూ ‘3’ సినిమాను భారీ రేట్లకు అమ్మడం.. దారుణంగా నష్టపోయిన బయ్యర్లను పట్టించుకోకుండా వదిలేయడం అప్పట్లో వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేసిన నట్టికుమార్ ధనుష్ మీద తీవ్ర ఆరోపణలు చేశాడు. ఇదిలా ఉంటే.. సినిమా ఫలితం ఎలా ఉన్నా తన పారితోషికం విషయంలో ధనుష్ చాలా కఠినంగా ఉంటాడన్న విమర్శలూ ఉన్నాయి.

తాజాగా కోలీవుడ్ నిర్మాతల్ని ఉద్దేశించి ధనుష్ విమర్శలు గుప్పించడం చర్చనీయాంశమైంది. తనకు ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్లను నిర్మాతలు సరిగా ఇవ్వట్లేదని.. దీని కోసం పోరాడాల్సి వస్తోందని ధనుష్ విమర్శించాడు. దీనిపై ధనుష్‌తో పని చేసిన కొందరు నిర్మాతలు ఎదురుదాడి చేశారు. అళగప్పని అని, రాజన్ అని ఇద్దరు నిర్మాతలు ధనుష్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

ధనుష్ సినిమాల్లో మెజారిటీ ఫ్లాప్ అయ్యాయని.. అతడి వల్ల చాలామంది నిర్మాతలు నాశనమయ్యారని.. కొందరు సినిమాలే మానుకుని ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయారని వీళ్లు విమర్శించారు. ధనుష్‌తో సినిమాలు తీసి నిర్మాతలు లాభాలు ఆర్జించిన దాఖలాలు దాదాపు లేవన్నారు. దర్శకులతో కలిసి అతను చేసిన పొరబాట్లు, అతి వల్ల బడ్జెట్లు పెరిగిపోయి.. అందుకు తగ్గట్లుగా బిజినెస్ జరగక నష్టాలు చవిచూసిన సందర్భాలు చాలా ఉన్నాయని ఆరోపించారు. ఇంకొందరు నిర్మాతలు తోడవుతుండగా.. ధనుష్ సైలెంటుగా ఉన్నాడు. అతడి అభిమానులు మాత్రం సదరు నిర్మాతల్ని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English