‘సాహో’ బడ్జెట్ పిచ్చి వదిలించుకుని ఉంటే..

‘సాహో’ బడ్జెట్ పిచ్చి వదిలించుకుని ఉంటే..

హాలీవుడ్లో ‘టైటానిక్’, ‘అవతార్’ లాంటి ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్లు అందించిన జేమ్స్ కామెరూన్ ఒక సినిమా తీస్తే దానికి రూ.10 వేల కోట్లకు తక్కువ కాకుండా బిజినెస్ అవుతుంది. అలాగని ఆయనేమీ 9 వేల కోట్లతో సినిమా తీయరు. మహా అయితే వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి సినిమా పూర్తి చేస్తాడు. మినిమం పది రెట్లు బిజినెస్ అయ్యేలా చూసుకుంటాడు. నాకు ఎంత మార్కెట్ ఉందో.. అంత మొత్తాన్ని బడ్జెట్‌గా పెట్టి సినిమా తీస్తానంటే అది తెలివి తక్కువతనమే అవుతుంది.

‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ సరిగ్గా ఇదే చేశాడు. అతడి మార్కెట్ పెరిగింది కదా అని అవసరం లేకున్నా ‘సాహో’ బడ్జెట్‌ను ఇష్టానుసారం పెంచుకుంటూ పోయారు. కానీ ఆ పెరిగిన ఖర్చు వల్ల సినిమాకు పెద్దగా ప్రయోజనం లేకపోయింది. ఏదో పెట్టాలి కాబట్టి ఖర్చు పెట్టారనిపిస్తుంది తప్ప.. అది సినిమాను కాంప్లిమెంట్ చేసింది తక్కువ.

‘సాహో’ను ముందు రూ.50 కోట్లలో తీయాలనుకున్నారట. కానీ చివరికి ఏడింతలు పెరిగి రూ.350 కోట్లు అయింది. నిజంగా అంత ఖర్చు పెట్టారా అన్నది వేరే చర్చ. కానీ ఈ బడ్జెట్ పిచ్చి వదిలించుకుని ఉంటే మాత్రం ఈ రోజు సినిమా ఫలితమే వేరుగా ఉండేది. ఒకవేళ స్కేల్ పెంచాలని అనుకుని ఉంటే.. బడ్జెట్‌ను రెండింతలు.. ఇంకా కావాలంటే మూడింతలు చేసుకుని ఉండొచ్చు. ఆ బడ్జెట్లో సినిమా తీసినా ఔట్ పుట్‌లో పెద్ద తేడా ఏమీ ఉండేది కాదు.

మరీ ‘సాహో’కు ఇప్పుడొచ్చినంత హైప్ రాకున్నా.. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ చేసిన సినిమా కాబట్టే క్రేజ్ అయితే లేకుండా ఉండి ఉండదు. దేశవ్యాప్తంగా మంచి బిజినెసే జరిగేది. ప్రేక్షకులు అంచనాలు మరీ ఈ స్థాయిలో ఉండేవి కూడా కావు. మామూలు దృష్టితో సినిమా చూసేవాళ్లు. ఇప్పట్లా కాకుండా సినిమా చూసి ‘ఓకే’ అనుకునేవాళ్లు. నిర్మాతలతో పాటు బయ్యర్లూ మంచి లాభాలతో హ్యాపీగా ఉండేవాళ్లు. ప్రభాస్ ఇంత భారం మోయాల్సిన, ఇంత టెన్షన్ పడాల్సిన పని ఉండేది కాదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English