రాజమౌళిని చూసి నేర్వాల్సిన పాఠం ఇదే..

రాజమౌళిని చూసి నేర్వాల్సిన పాఠం ఇదే..

ప్రస్తుతం రాజమౌళి తన పాటికి తాను ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తీసుకుంటున్నాడు. కానీ దేశవ్యాప్తంగా ఆయన పేరు చర్చనీయాంశమవుతోంది. జక్కన్న తీసిన ‘బాహుబలి’లో నటించి తిరుగులేని ఇమేజ్ సంపాదించిన ప్రభాస్.. దాని తర్వాత అదే స్థాయిలో భారీ బడ్జెట్లో చేసిన ‘సాహో’ కు బ్యాడ్ టాక్ తెచ్చుకోవడంతో ఆయన పేరు చర్చకు వచ్చింది.

రాజమౌళి ఎంతటి మేధావో, ఎంత పకడ్బందీగా సినిమాలు తీర్చిదిద్దుతాడో.. వనరుల్ని ఎంత బాగా ఉపయోగించుకుంటాడో.. ప్రేక్షకుల అభిరుచిపై ఆయనకు ఎంత గొప్ప పట్టు ఉందో జనాలకు ఇప్పుడు మహ బాగా అర్థమవుతోంది. ‘సాహో’ ప్రోమోలు చూసి.. ఇది ‘బాహుబలి’కి దీటైన చిత్రం అనే ప్రచారం జరిగింది. ప్రేక్షకుల్లో అంచనాలు కూడా అదే స్థాయిలో ఏర్పడ్డాయి.

కానీ కేవలం వందల కోట్లు ఖర్చు పెట్టినంత మాత్రాన అన్ని సినిమాలూ ‘బాహుబలి’లు అయిపోవని మరోసారి రుజువైంది. ఎంత ఖర్చు పెట్టాం అన్నది ముఖ్యం కాదు.. ఆ ఖర్చును సినిమా కోసం ఎంత బాగా ఉపయోగించుకున్నాం.. ప్రేక్షకులకు ఆ బడ్జెట్ ద్వారా ఎంత ఎమోషనల్ హై ఇచ్చాం అన్నది కీలకం. ఈ విషయంలో రాజమౌళికి ఎవరూ సాటి రారు.

‘బాహుబలి’ సినిమాకు ఇన్ని వందల కోట్లు ఖర్చు పెట్టాలని జక్కన్న ఏమీ టార్గెట్ పెట్టుకోలేదు. ఆయనో భారీ కల కన్నాడు. పెద్ద కాన్వాస్ ఊహించుకున్నాడు. అందుకు అనుగుణంగా ఖర్చు పెట్టుకుంటూ పోతే.. క్వాలిటీ కోసం తపిస్తే అంత ఖర్చయింది. ఐతే ఖర్చు పెట్టిన ప్రతి పైసా తెరమీద కనిపించేలా చేయడం, ప్రేక్షకులకు నభూతో అనిపంచే అనుభూతి పంచడంలో రాజమౌళి గొప్పదనం కనిపిస్తుంది. కానీ ‘సాహో’ చూస్తే దీనికి ఇంత బడ్జెట్ పెట్టారా అనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ కలిగింది.

‘బాహుబలి’లో ఏ సెట్టింగ్, ఏ ఎఫెక్ట్ కూడా అనవసరం అనిపించదు. ప్రతి హంగు కూడా సినిమాకు ప్లస్సే అయింది. కానీ ‘సాహో’లో ఒక సిటీని సెట్ రూపంలో వేయాల్సిన అవసరం ఏముందనిపిస్తుంది. ఒక పాటలో అనవసరంగా రెండు కార్లను క్రష్ చేస్తుంటే చూసే వాళ్లకు గుండె కలుక్కుమంటుంది.

‘సాహో’ కంటే ముందు శంకర్ తీసిన ‘2.0’ కూడా ఇదే కోవలోకి వస్తుంది. దానికి రూ.545 కోట్ల బడ్జెట్ ఎందుకో అర్థం కాదు. చెప్పిన బడ్జెట్‌కు తగ్గ ఔట్ పుట్ ఆ సినిమాలో కనిపించదు. మొత్తంగా చూస్తే ఎంత ఖర్చు పెట్టించాం అన్నది కాదు.. ప్రేక్షకులకు ఎలాంటి అనభూతిని కలిగించాం అన్నది అన్నిటికంటే ముఖ్యమైన విషయం. ఈ విషయంలో జక్కన్నను చూసి ప్రతి దర్శకుడూ పాఠం నేర్వాల్సిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English