తెలుగమ్మాయికి లైఫ్ ఇవ్వబోయి బుక్కయ్యాడు

తెలుగమ్మాయికి లైఫ్ ఇవ్వబోయి బుక్కయ్యాడు

సీనియర్ నిర్మాత కె.ఎస్.రామారావు.. కొన్నేళ్ల పాటు సినీ నిర్మాణానికి దూరంగా ఉండి ఈ మధ్య మళ్లీ యాక్టివ్ అవ్వాలని చూస్తున్నారు. కానీ ఆయనకు కాలం కలిసి రావట్లేదు. కొన్నేళ్ల కిందట ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ అనే డీసెంట్ మూవీ ఆయన్నుంచి వచ్చింది. కానీ మంచి సినిమాగా పేరు తెచ్చుకున్నప్పటికీ అది పెద్దగా డబ్బులు తెచ్చిపెట్టలేదు.

తర్వాత గత ఏడాది సాయిధరమ్ తేజ్ హీరోగా ‘తేజ్ ఐ లవ్యూ’ అనే సినిమా అందించాడాయన. ఈ చిత్రం పేరూ తేలేదు. డబ్బులూ పోగొట్టింది. ఇప్పుడేమో ‘కౌసల్యా కృష్ణమూర్తి’ అనే లేడీ ఓరియెంటెడ్ మూవీ తీస్తే అది పెట్టిన పెట్టుబడి మొత్తం పోగొట్టేసింది. రామారావు తొందరపడి ఈ సినిమా చేశారని ఇండస్ట్రీలో ఆయన శ్రేయోభిలాషులు వాపోతున్నారు.

‘కౌసల్యా కృష్ణమూర్తి’ సినిమాను రామారావు అనుకోకుండానే చేశారు. దీని తమిళ వెర్షన్ ‘కనా’ రిలీజ్ కావడానికి ముందే అందులో కథానాయిక అయిన తెలుగమ్మాయి ఐశ్వర్యా రాజేష్‌ను తాను ప్రొడ్యూస్ చేస్తున్న సినిమాలో ఒక కథానాయికగా తీసుకున్నారు రామారావు. విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్ రూపొందిస్తున్న చిత్రమిది. ఐతే ఈ సినిమా మేకింగ్ దశలో ఉండగా ‘కనా’ విడుదలైంది. ఐశ్వర్య టాలెంట్ చూసి ఆశ్చర్యపోయిన ఆయన.. అప్పటికే సెట్స్ మీద ఉన్న సినిమా కంటే ముందు ‘కనా’ను రీమేక్ చేసి రిలీజ్ చేస్తే తెలుగులో ఆమెకు మంచి లాంచింగ్ అవుతుందనుకున్నారు.

అనుకున్నదే తడవుగా రీమేక్ చిత్రాల స్పెషలిస్టు భీమనేని శ్రీనివాసరావును లైన్లో పెట్టి శరవేగంగా సినిమాను పూర్తి చేయించాడు. రిలీజ్ చేశాడు. కానీ ఐశ్వర్య మన ప్రేక్షకులకు పెద్దగా పరిచయమే లేదు. ఆమె లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తే జనాలకు ఏం పడుతుంది? మంచి సినిమానే అయినా ఆదరణ పొందలేదు. రామారావు పెట్టిన ఖర్చంతా వృథా అయింది. ఇప్పుడు ఆయన ఆశలన్నీ విజయ్-క్రాంతి మాధవ్ సినిమా మీదే ఉన్నాయి. ఇది కనుక ఆడకపోతే ఇక ఆయన నిర్మాణం మానుకోవాల్సిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English