రాతకు ఐదేళ్లు.. తీతకు 4 నెలలు

మామూలుగా ఒక సినిమాకు స్క్రిప్టు రెడీ చేయడం కంటే.. ఆ సినిమా తీయడానికి ఎక్కువ టైం పడుతుంటుంది. ఇండస్ట్రీలో మెజారిటీ చిత్రాల విషయంలో ఇదే జరుగుతుంటుంది. కానీ కొన్ని సినిమాలకు మాత్రం స్క్రిప్టుకే ఎక్కువ టైం పడుతుంటుంది. సినిమాను వేగంగా లాగించేస్తుంటారు. ‘బంగార్రాజు’ రెండో కోవకే చెందుతుంది. ఐతే ఈ సినిమా విషయంలో రాతకు, తీతకు మధ్య తేడా మాత్రం చాలా చాలా ఎక్కువ.

ఈ కథకు పునాది పడింది ఆరేళ్ల కిందట. ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమా రిలీజైనపుడే ఈ సినిమా బేసిక్ ఐడియా రెడీ అయిపోయింది. ఈ సినిమా చేద్దామని ‘సోగ్గాడే..’ రిలీజ్ రోజే ఫిక్సయిపోయారు నాగార్జున, కళ్యాణ్ కృష్ణ. ఆ ఏడాదే ‘బంగార్రాజు’ గురించి అనౌన్స్‌మెంట్ కూడా వచ్చింది. కానీ ఈ సినిమా పట్టాలెక్కడంలో మాత్రం విపరీతమైన జాప్యం జరిగింది.

ఓపక్క ఈ సినిమాకు కథ రెడీ చేస్తూనే.. ఇంకో పక్క ‘రారండోయ్ వేడుక చూద్దాం’, ‘నేల టిక్కెట్టు’ చిత్రాలు చేశాడు కళ్యాణ్ కృష్ణ. అవి రెండూ పూర్తయ్యాక కూడా ‘బంగార్రాజు’ ఒక పట్టాన సెట్స్ మీదికి వెళ్లలేదు. ‘సోగ్గాడే..’ విషయంలోనూ స్క్రిప్టు దగ్గర చాలా టైమే పట్టింది. సీనియర్ రైటర్ సత్యానంద్ సహా కొందరు రచయితలతో కలిసి వెర్షన్ల మీద వెర్షన్లు రాయించి.. మళ్లీ మళ్లీ ఫైన్ ట్యూన్ చేయించి.. చివరికి ఆ స్క్రిప్టును ఓకే చేసి సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్లాడు నాగ్. ‘బంగార్రాజు’ విషయంలో అయితే కసరత్తు ఇంకా ఇంకా ఎక్కువైంది.

ఇదిగో అదిగో అనుకుంటూనే ఏళ్లకు ఏళ్లు గడిచిపోయాయి. నాగ్ ఎంతకీ ఈ స్క్రిప్టు విషయంలో సంతృప్తి చెందలేదు. చివరికి గత ఏడాది ఆయన సినిమా తీయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇలా ఈ స్క్రిప్టు పని దాదాపు ఐదేళ్లు సాగింది. ఐతే స్క్రిప్టు తయారీకి ఇంత కాలం పడితే.. సినిమా తీయడానికి మాత్రం కేవలం నాలుగు నెలలే పట్టింది. గత ఏడాది జులైలో షూటింగ్ మొదలుపెట్టి డిసెంబరు మధ్యలోనే చిత్రీకరణ అవగొట్టేశారు. చకచకా పోస్ట్ ప్రొడక్షన్ చేసి సంక్రాంతికి రిలీజ్ చేసేస్తున్నారు. మరి ఐదేళ్లు కష్టపడి వండిన కథలో ఏం విశేషాలున్నాయో.. ఇంత వేగంగా తీసిన సినిమాలో ఏమాత్రం క్వాలిటీ ఉందో చూడాలి ఈ నెల 14న.