రామ్ మత్తులో కూరుకుపోయాడా?

రామ్ మత్తులో కూరుకుపోయాడా?

యువ కథానాయకుడు రామ్‌కు మాస్ సినిమాలంటే భలే పిచ్చి. అతను మామూలుగా చూడ్డానికి చాలా క్లాస్‌గా కనిపిస్తాడు. లవ్ స్టోరీలకు బాగా ఫిట్ అయ్యేలా కనిపిస్తాడు. కానీ రామ్ మాత్రం మాస్ మాస్ అంటూ ఊగిపోతుంటాడు. శాల్తీ చాలా చిన్నదైనా కూడా తెరమీద అతను చేసే హడావుడి మామూలుగా ఉండదు.

కొన్ని మాస్ క్యారెక్టర్లను బాగానే పండించి హిట్లు కొట్టినప్పటికీ.. ఈ మసాలా సినిమాలతో ఎదురు దెబ్బలు కూడా తక్కువగా ఏమీ తినలేదు రామ్. అయినా అతను మాస్ మంత్రాన్ని విడిచిపెట్టడు. అందులోనూ ‘ఇస్మార్ట్ శంకర్’ అనుకోకుండా పెద్ద హిట్టయిపోయే సరికి.. రామ్ మాస్ మత్తులో ఇంకా ఎక్కువగా మునిగిపోయాడనేది ఇండస్ట్రీ టాక్. ఈ మత్తుతోనే.. ఒక మంచి థ్రిల్లర్ మూవీని అతను వదులుకుంటున్నట్లు సమాచారం.

తమిళంలో ఈ ఏడాది మంచి విజయం సాధించిన థ్రిల్లర్ సినిమా ‘తడమ్’. ‘సాహో’లో కీలక పాత్ర చేసిన అరుణ్ విజయ్ కథానాయకుడిగా నటించాడు. అతనీ చిత్రంలో ద్విపాత్రాభినయం చేశాడు. మగిల్ తిరుమణి దర్శకత్వం వహించిన ‘తడమ్’.. ప్రేక్షకుల్ని తీవ్ర ఉత్కంఠకు గురి చేస్తూ ఉర్రూతలూగించింది. చివరి వరకు సస్పెన్స్‌ను నిలిపి ఉంచుతూ.. ప్రేక్షకుల్ని గెస్సింగ్‌లో పెడుతూ టైట్ స్క్రీన్ ప్లేతో ఆకట్టుకుంది ‘తడమ్’.

ఈ సినిమా రిలీజైన కొన్ని రోజులకే తెలుగు రీమేక్ కోసం సన్నాహాలు మొదలయ్యాయి. రామ్ పెదనాన్న స్రవంతి రవికిషోరే రీమేక్ హక్కులు తీసుకున్నట్లు సమాచారం. ముందు రామ్ కూడా సినిమా చూసి ఓకే అన్నట్లు చెప్పుకున్నారు. కానీ ‘ఇస్మార్ట్ శంకర్’ రిలీజ్ తర్వాత అతడి మనసు మారిపోయిందట. మరో మాస్ మసాలా సినిమా చేయడానికే అతను సిద్ధమవుతున్నాడని.. ‘తడమ్’ లాంటి డిఫరెంట్ మూవీ వద్దనుకున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.

కానీ ప్రతిసారీ మాస్ మాస్ అంటే జనాలకు మొహం మొత్తడం ఖాయం. ‘తడమ్’ లాంటి సినిమా చేస్తే రామ్ తనలోని భిన్న కోణాల్ని చూపించడానికి అవకాశముండేది. అతడి కెరీర్లో ఇదో వైవిధ్యమైన సినిమా అయ్యేది. మరి ఎందుకతను వెనుకడుగు వేస్తున్నాడో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English