ఎంతైనా రాజమౌళి రాజమౌళేనబ్బా..

ఎంతైనా రాజమౌళి రాజమౌళేనబ్బా..

పాజిటివ్‌గా మాట్లాడుతున్నారా.. నెగెటివ్‌గా మాట్లాడుతున్నారా అన్నది తర్వాత.. కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా సినీ ప్రియుల చర్చలన్నీ ప్రభాస్ కొత్త సినిమా ‘సాహో’ చుట్టూనే తిరుగుతున్నాయి. ఈ సినిమా విడుదలకు కొన్ని రోజుల ముందు నుంచే అందరి డిస్కషన్లూ దాని చుట్టూనే తిరుగుతన్నాయి. ఇక రిలీజ్ రోజు రచ్చ గురించి చెప్పాల్సిన పని లేదు. ఐతే  ఈ సందర్భంలో రాజమౌళి పేరు సైతం చర్చల్లో భాగమవుతోంది.

‘సాహో’ ఫలితం గురించి మాట్లాడుతున్న ప్రతి ఒక్కరూ ‘బాహుబలి’ ప్రస్తావన తెచ్చి రాజమౌళిని పొగిడే పనిలో పడుతున్నారు. ఎంతైనా రాజమౌళి రాజమౌళే అనే అభిప్రాయం తెలుగు వారే కాదు.. వేరే భాషల వాళ్లూ వ్యక్తం చేస్తున్నారు. వనరులు, బడ్జెట్ ఉండటం ముఖ్యం కాదు.. వాటిని ఎలా ఉపయోగించుకోవాలి అన్నది ఎవ్వరైనా రాజమౌళిని చూసే నేర్చుకోవాలి అనే అభిప్రాయం ఇప్పుడు విస్తృతంగా వినిపిస్తోంది.

‘బాహుబలి’ తర్వాత మొత్తంగా ఇండియన్ సినిమా మార్కెట్ ఎంతగానో విస్తరించింది. మంచి కంటెంట్ ఇవ్వాలే కానీ.. వసూళ్లకు హద్దులంటూ ఏమీ లేవని.. ఈ విషయంలో పరిమితుల్ని దాటి సినిమా విస్తరిస్తుందని.. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రేక్షకుడికి ఒక సినిమాను చేరువ చేయొచ్చని రాజమౌళి రుజువు చేశాడు. ఐతే ‘బాహుబలి’ని చూసి చాలామంది అలాంటి భారీ ప్రయత్నాలు చేశారు కానీ.. ఎవ్వరూ విజయవంతం కాలేదు.

హిందీలో అమీర్ ఖాన్ హీరోగా ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ లాంటి భారీ చిత్రాలు తీశారు. తమిళంలో శంకర్ అయినకాడికి బడ్జెట్ పెంచి ‘2.0’ను తీర్చిద్దాడు. కానీ ఊరికే బడ్జెట్లు పెంచుకుని, భారీతనం జోడించినంత మాత్రాన సినిమాలు ‘బాహుబలి’ స్థాయిని అందుకోలేవని ఇవి రుజువు చేశాయి. ఆ సినిమాలకు భారీతనం ఎంతమాత్రం కలిసి రాలేదు.

రాజమౌళిలా ఎమోషనల్‌గా సినిమాను ప్రేక్షకులకు కనెక్ట్ చేయడంలో, భావోద్వేగాల్ని బయటికి తీయడంలో మిగతా వాళ్లు విజయవంతం కాలేదు. తాజాగా సుజీత్ సైతం ఈ విషయంలో ఘోరంగా విఫలమయ్యాడు. కేవలం బడ్జెట్ పెంచుకుని, అదనపు హంగులు జోడిస్తే ‘బాహుబలి’లా విజయం సాధించొచ్చు అనుకునే వాళ్లకు ‘సాహో’ చెంపపెట్టు లాంటి మరో సమాధానం అని చెప్పుకోవచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English