చిరు, మహేష్‌తో ఫెయిల్.. ఇక బన్నీతోనట

చిరు, మహేష్‌తో ఫెయిల్.. ఇక బన్నీతోనట

తమిళంలో మురుగదాస్ చాలా పెద్ద దర్శకుడు. శంకర్ తర్వాత ఆ స్థాయి ఇమేజ్ ఉన్నది మురుగదాస్‌కే. రమణ, గజిని, తుపాకి, కత్తి లాంటి ఆల్ టైం హిట్లతో తన స్థాయిని చాటిచెప్పాడు మురుగదాస్. ఐతే సొంతగడ్డపై ఎంతగా సత్తా చాటినా.. తెలుగులో మాత్రం అతడికి చేదు అనుభవాలే ఎదురయ్యాయి. మురుగదాస్ మీద అపారమైన నమ్మకంతో టాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్స్ అతడికి అవకాశమిచ్చారు.

ముందుగా మెగాస్టార్ చిరంజీవి.. మురుగదాస్ దర్శకత్వంలో ‘స్టాలిన్’ చేశాడు. అప్పటికే మురుగ కథతోనే ‘ఠాగూర్’ చేసి భారీ విజయాన్నందుకున్న చిరు.. ‘స్టాలిన్’తో అదే స్థాయి హిట్ కొడతాననుకున్నారు. కానీ ఆ సినిమా అంచనాల్ని అందుకోలేకపోయింది. అందులో మురుగదాస్ మార్కు కనిపించలేదు.

ఆ తర్వాత దశాబ్దం విరామం తీసుకుని సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘స్పైడర్’ తీశాడు. దీనిపైనా భారీ అంచనాలు నెలకొన్నాయి. వాటిని ఏమాత్రం అందుకోలేక డిజాస్టర్‌గా నిలిచిందా చిత్రం. దీంతో మురుగదాస్ మళ్లీ తెలుగు వైపు చూసే సాహసం చేయడనే అంతా అనుకున్నారు. కానీ ఆయన మళ్లీ ఓ తెలుగు సూపర్ స్టార్‌తో సినిమాకు సన్నాహాలు చేసుకుంటున్నాడట.

ఈసారి అల్లు అర్జున్‌తో సినిమా చేయబోతున్నాడట. ఎప్పట్నుంచో ఓ ద్విభాషా చిత్రం ద్వారా తమిళంలో అడుగు పెట్టాలని చూస్తున్నాడు బన్నీ. లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా అనౌన్స్ కూడా చేశాడు. కానీ అది వర్కవుట్ కాలేదు. ఇప్పుడు మురుగదాస్ సినిమా ద్వారా తమిళంలోకి వెళ్లాలని బన్నీ ఆలోచిస్తున్నాడట. ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్‌తో ‘దర్బార్’ తీస్తున్న మురుగదాస్.. దాని తర్వాత బన్నీతో సినిమాను వర్కవుట్ చేయాలని చూస్తున్నాడు.

ఇద్దరి మధ్య కథా చర్చలు నడుస్తున్నట్లు సమాచారం. ఐతే బన్నీతో సినిమా కోసం మురుగదాస్ ఇంకో ఏడాదైనా ఎదురు చూడాల్సి ఉంటుంది. సుకుమార్ చిత్రంతో పాటు వేణు శ్రీరామ్ ‘ఐకాన్’ను కూడా పూర్తి చేశాక కానీ బన్నీ తన కొత్త సినిమా మొదలు పెట్టే అవకాశం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English