జేమ్స్ కామెరూన్‌, ఆర్నాల్డ్ మ‌ళ్లీ క‌లిసి వ‌స్తున్నార‌హో

జేమ్స్ కామెరూన్‌, ఆర్నాల్డ్ మ‌ళ్లీ క‌లిసి వ‌స్తున్నార‌హో

జేమ్స్ కామెరూన్ పేరెత్తితే చాలు.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా సినీ ప్రేక్ష‌కుల్లో ఒక పుల‌కింత క‌లుగుతుంది. ఒక అవ‌తార్.. ఒక టైటానిక్.. ఒక టెర్మినేట‌ర్.. మామూలు సినిమాలు తీశాడా అత‌ను. టైటానిక్, అవ‌తార్ సినిమాల‌తో ఆయా స‌మ‌యాల్లో అన్ని వ‌సూళ్ల రికార్డులనూ బ‌ద్ద‌లు కొట్ట‌డ‌మే కాదు.. ఎన్నెన్నో ప్ర‌తిష్టాత్మక పుర‌స్కారాలు కూడా అందుకున్నాడాయ‌న‌.

అవ‌తార్ చిత్రంతో ప్ర‌పంచ  ప్రేక్ష‌కులంద‌రినీ అద్భుత ప్ర‌పంచంలోకి తీసుకెళ్లిన కామెరూన్.. అవ‌తార్ సిరీస్‌లో ఇంకో మూడు సినిమాల్ని తీర్చిదిద్దే ప‌నిలో ఉన్న సంగ‌తి తెలిసిందే. 2021 నుంచి నాలుగేళ్ల వ్య‌వ‌ధిలో ఈ మూడు సినిమాలు రిలీజ‌వుతాయి. ఐతే ఈ మెగా ప్రాజెక్టు మీద ప‌ని చేస్తూనే నిర్మాత‌గా మ‌రో ప్రెస్టీజియ‌స్ సినిమాను నెత్తికెత్తుకున్నాడు కామెరూన్. అదే.. టెర్మినేట‌ర్-డార్క్ ఫేట్‌.

టెర్మినేట‌ర్ సిరీస్‌లో తొలి సినిమాకు కామెరూనే ద‌ర్శ‌కుడు. రెండో చిత్రానికి ద‌ర్శ‌కుడు మాత్ర‌మే కాదు.. నిర్మాత కూడా. ఈ సినిమాల‌తో ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగ్గ‌ర్ ఎంత ఫేమ‌స్ అయ్యాడో తెలిసిందే. ఐతే టెర్మినేట‌ర్ సిరీస్‌లో వ‌చ్చిన త‌ర్వాతి మూడు చిత్రాల‌తో కామెరూన్‌కు సంబంధం లేదు. దాని ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు వేరు.

ఐతే ఈ సిరీస్‌లో వ‌స్తున్న ఆరో చిత్రం అయిన డార్క్ ఫేట్‌కు కామెరూనే నిర్మాత. టిమ్ మిల్ల‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. మ‌ళ్లీ కామెరూన్‌, ఆర్నాల్డ్ ఇన్నేళ్ల త‌ర్వాత క‌లిసి టెర్మినేట‌ర్ సిరీస్‌లో సినిమా చేయ‌డంతో డార్క్ ఫేట్‌పై అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. ఈ ఏడాది న‌వంబ‌రు 1న ఈ చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. మ‌రి ఈ సూప‌ర్ హిట్ జోడీ ఈసారి ఎలాంటి సినిమాను అందిస్తుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English