సింధు బయోపిక్.. వీళ్లెప్పటికి తీయాలి

సింధు బయోపిక్.. వీళ్లెప్పటికి తీయాలి

భారత బ్యాడ్మింటన్‌ను తిరుగులేని స్థాయికి తీసుకెళ్లిన ధ్రువతార పూసర్ల వెంకట సింధు. సైనా నెహ్వాల్‌‌కు దీటైన షట్లర్ మరొకరు రాకపోవచ్చు అనుకున్న తరుణంలో పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన ఈ తెలుగమ్మాయి సైనాను మించి ఎదిగిపోయింది. ప్రకాశ్ పదుకొనే తర్వాత ఎవరికీ సాధ్యం కాని ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో సింగిల్స్ పతకాన్ని 2013లోనే సాధించిన ఆమె.. ఆ తర్వాతి ఏడాది రెండో పతకంతో చరిత్ర సృష్టించింది.

ఇక 2016 రియో ఒలింపిక్స్‌లో గెలిచిన రజత పతకంతో ఆమె పేరు దేశవ్యాప్తంగా ఎలా మార్మోగిపోయిందో తెలిసిందే. అక్కడితో ఆగిపోయి ఉంటే సింధు ప్రత్యేకత ఏమీ ఉండేది కాదు. కానీ ఆటమీద మరింత దృష్టిసారించి ఇంకా ఎదిగింది. గత రెండేళ్లలో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో వరుసగా రెండు రజతాలు సాధించి ఔరా అనిపించిన సింధు.. ఈ ఏడాది ఏకంగా స్వర్ణమే కొల్లగొట్టింది.

రియో ఒలింపిక్స్‌లో సింధు రజతం గెలిచినపుడు దేశవ్యాప్తంగా వచ్చిన స్పందన చూసి ఆమె సినిమా తీయడానికి రెడీ అయ్యాడు బాలీవుడ్ నటుడు సోనూ సూద్. మూడేళ్లుగా ఈ సినిమా కోసం స్క్రిప్టు పని నడుస్తోంది. కానీ అది ఎంతకీ తెగట్లేదు. ఇందుక్కారణం క్లైమాక్స్ విషయంలో ఒక నిర్ణయానికి రాలేకపోవడమే. ముందు రియో పతకం దగ్గరే సినిమాను ముగించాలనుకున్నారు. కానీ ఆ తర్వాత వరుసగా ఆమె ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రెండు రజతాలు సాధించింది. అది పెద్ద ఘనతే. కాబట్టి అక్కడ ముగింపు అనుకున్నారు. కానీ ఈ ఏడాది ఏకంగా బంగారు పతకం సాధించింది. ఇప్పుడేమో సోనూ మళ్లీ క్లైమాక్స్ మారుస్తున్నామని.. దీన్నే క్లైమాక్స్‌గా చేయబోతున్నామని అన్నాడు.

కానీ ఇక్కడ సింధు ఏకపక్ష విజయం సాధించింది. మ్యాచ్‌లో అసలేమాత్రం డ్రామా లేదు. ఇక్కడ సినిమాను ముగిస్తే సాధారణంగా అనిపిస్తుందేమో. పైగా వచ్చే ఏడాది ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ వస్తోంది. అక్కడ సింధు స్వర్ణం గెలిచే అవకాశాలు లేకపోలేదు. కాబట్టి అందుకోసం సోనూ టీం ఎదురు చూడకుండా ఉండదు. అక్కడేమైనా తేడా జరిగితే ఏంటి పరిస్థితన్నది చూడాలి. చూస్తుంటే సింధు కెరీర్ ముగిసేవరకు ఇలా స్క్రిప్టును మార్చుకుంటూనే వెళ్లి ఎన్నేళ్లకు సినిమాను పట్టాలెక్కిస్తారో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English