నిర్మాత దేవ‌ర‌కొండ‌.. టైటిల్ ఫిక్స్ చేశాడు

నిర్మాత దేవ‌ర‌కొండ‌.. టైటిల్ ఫిక్స్ చేశాడు

విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా మాత్ర‌మే ఉండిపోవాల‌ని అనుకోవ‌ట్లేద‌ని అత‌డి తీరు చూస్తే అర్థ‌మ‌వుతుంది. త‌న‌కు కొంచెం క్రేజ్ రాగానే రౌడీ బ్రాండ్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చి బిజినెస్ మ్యాన్ అయిపోయాడు. ఆల్రెడీ నోటా సినిమాలో నిర్మాణ భాగ‌స్వామిగా కూడా ఉన్నాడు. ఇప్పుడ‌త‌ను పూర్తి స్థాయిలో నిర్మాత అవ‌తారం ఎత్తేస్తున్నాడు.

పెళ్ళిచూపులు సినిమాతో త‌న‌కు హీరోగా లైఫ్ ఇచ్చిన ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్‌ను హీరోగా ప‌రిచ‌యం చేస్తూ విజ‌య్ త‌న తొలి ప్రొడ‌క్ష‌న్ మొద‌లుపెట్ట‌డం విశేషం. ష‌మ్మీర్ అనే నూత‌న ద‌ర్శ‌కుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. అన‌సూయ భ‌ర‌ద్వాజ్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఈ సినిమాకు టైటిల్ కూడా ఖ‌రారు చేశారు.

మీకు మాత్ర‌మే చెప్తా.. ఇదీ విజ‌య్ నిర్మాణంలో త‌రుణ్ భాస్క‌ర్ హీరోగా న‌టిస్తున్న సినిమా పేరు. కొత్త‌గా.. ప్రేక్ష‌కుల‌కు ఈజీగా క‌నెక్ట‌య్యేలా ఉండే టైటిలే పెట్టింది చిత్ర బృందం. ఈ టైటిల్ అనౌన్స్‌మెంట్ కోసం విజ‌య్, త‌రుణ్ భాస్క‌ర్ త‌మ‌దైన శైలిలో ఒక వీడియో కూడా రూపొందించారు. క్రికెట్ ఆడుతున్న త‌రుణ్‌కు ఫోన్ చేసి విజ‌య్ ఓ స్క్రిప్టు విన్నా అని.. మ‌నం పెళ్లిచూపులు సినిమా కోసం ఎలా త‌పించామో అలాగే ఈ చిత్ర బృందం కూడా క‌ష్ట‌ప‌డింద‌ని.. త‌న సేవింగ్స్ అన్నీ పెట్టి ఈ సినిమా తీస్తాన‌ని విజ‌య్ చెప్ప‌డం.. హీరో ఎవ‌రంటే నువ్వే అన‌గానే త‌రుణ్ భాస్క‌ర్ షాక‌వ్వ‌డం.. త‌ర్వాత టైటిల్ అడిగితే మీకు మాత్ర‌మే చెప్తా అని విజ‌య్ అన‌డం.. స‌డెన్‌గా ఈ రెస్పెక్ట్ ఏంటి అంటే.. అదే టైటిల్ అని విజ‌య్ వెల్ల‌డించ‌డం.. ఇలా ఫ‌న్నీ ఫ‌న్నీగా సాగిపోయిందీ వీడియో.

ఇది చూస్తే ప్రోమోలు క‌ట్ చేయించ‌డంలో, సినిమాను ప్ర‌మోట్ చేసుకోవ‌డంలో విజ‌య్ త‌ర్వాతే ఎవ‌రైనా అనిపిస్తుంది. ఆస‌క్తిక‌ర కాంబినేష‌న్లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లే ఉంటుందేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English