మళ్లీ వర్మ మాయలో పడతారా?

మళ్లీ వర్మ మాయలో పడతారా?

పాతాళానికి పడ్డట్లే ఉంటాడు. కానీ మళ్లీ లేచి ఉనికిని చాటుకుంటూ ఉంటాడు రామ్ గోపాల్ వర్మ. గత దశాబ్ద కాలంలో ఇలా ఎన్నోసార్లు జరిగింది. వర్మ తీసిన చెత్త సినిమా ఒకటి చూసి ఇక ఆయన పనైపోయిందనే అనుకుంటాం. తెగ తిట్టుకుంటాం. ఇక ఈయన సినిమా వైపుకే రావొద్దని అనుకుంటాం. కానీ మళ్లీ ఏదో ఒక కాంట్రవర్శల్ సబ్జెక్ట్ తీసుకుని.. దాన్ని తనదైన శైలిలో ప్రమోట్ చేసి జనాల దృష్టిని ఆకర్షిస్తాడు వర్మ.

‘ఆఫీసర్’ లాంటి ఆల్ టైం డిజాస్టర్ తర్వాత ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’తో ఇలాగే ప్రేక్షకుల్ని పడేసే ప్రయత్నం చేశాడు వర్మ. ఈ సినిమాకు ప్రి రిలీజ్ బజ్ అయితే వచ్చింది కానీ.. ఎప్పట్లాగే సినిమాలో విషయం లేక బోల్తా కొట్టింది. అయినా వర్మ తగ్గుతాడా? ఈసారి ఆయన దృష్టి ఆంధ్రప్రదేశ్‌లో వేళ్లూనుకుపోయి.. రోజు రోజుకూ ఇంకా పెరిగిపోతున్న కులాభిమానం మీదికి మళ్లింది. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ పేరుతో సినిమా అనౌన్స్ చేసిన ఆర్జీవీ.. ‘క్యాస్ట్ ఫీలింగ్’ మీద ఒక పాట రెడీ చేసి జనాల్లోకి వదిలేశాడు.

సినిమా ఎప్పట్లాగే నాసిరకంగానే ఉంటుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి కానీ.. ఈ పాట అయితే చాలా స్ట్రైకింగ్‌గా ఉందన్నది  వాస్తవం. ఈ పాటంతా విన్న ఎవరైనా వర్మ వర్మే అనుకోకుండా ఉండరు. క్యాస్ట్ ఫీలింగ్ విషయంలో జనాల హిపోక్రసీని వర్మ తనదైన శైలిలో కడిగి పారేశాడు. ‘కులం గురించి అడిగేవాడు గాడిద’ అంటూ ఒక టీవీ ఛానెల్ స్లోగన్‌ మీద సెటైర్ వేయడం మొదలుకుని.. కులం పట్టింపు లేదని, ప్రతిభే ముఖ్యమని అంటూనే ఎలా ప్రభుత్వాలు, పార్టీలు కులానికి ప్రాధాన్యం ఇస్తాయో ఈ పాటలో వివరించాడు.

కమ్మలు అంటూ చంద్రబాబును.. రెడ్లు అంటూ జగన్‌ను.. కాపులు అంటూ పవన్‌ను.. వైశ్యులు అంటూ రోశయ్యను.. బ్రాహ్మణులు అంటూ ఉండవల్లి అరుణ్ కుమార్‌ను చూపిస్తూ చాలా సింపుల్‌ విజువల్స్‌తో పాటను లాగించేశాడు. కులంతో ముడిపడ్డి మరిన్ని ఫొటోలు, న్యూస్ క్లిప్సింగ్స్ కూడా వేశాడు. ఎందుకీ హిపోక్రసీ అంటూ గట్టిగానే నిలదీశాడు వర్మ. మొత్తానికి మరోసారి జనాలు తప్పక తన సినిమాను పట్టించుకోని పరిస్థితి కల్పించాలన్నది వర్మ ప్రయత్నంగా ఉంది. మరి ఎప్పట్లాగే జనాలు వర్మ బుట్టలో పడతారా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English