జనసేనకు ఇష్టం లేదని బాబే చెప్పేశారే !

ఈ విషయం స్వయంగా చంద్రబాబు నాయుడు చెప్పిన తర్వాత ఎవరైనా ఎలా కాదనగలరు ? కుప్పం పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడు స్వయంగా చేసిన వ్యాఖ్యే దీనికి నిదర్శనం. రామకుప్పంలో చంద్రబాబు మాట్లాడుతున్నపుడు ఓ కార్యకర్త అడ్డుతగిలాడు. అతన చంద్రబాబును ఉద్దేశించి వచ్చే ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకోవచ్చు కదా అని అడిగాడు. దానికి చంద్రబాబు సమాధానమిస్తూ  ఇద్దరు ప్రేమించుకుంటేనే అది పెళ్ళిదాకా వెళుతుందన్నారు.

ప్రస్తుతం జనసేన విషయంలో టీడీపీది వన్ సైడ్ లవ్వే అని, అది పనికిరాదు కదా అంటూ ప్రశ్నించారు. ‘మనం జనసేనను ప్రేమిస్తున్నాం..జనసేన కూడా మనతో కలిసి రావాలి కదా’ అన్నారు. హోలు మొత్తం మీద చూస్తే జనసేనతో పొత్తు పెట్టుకునే విషయంలో చంద్రబాబు  ప్రయత్నిస్తున్నారనే విషయం బయటపడింది. ఒకవైపు బీజేపీ+జనసేన మిత్రపక్షాలు. ఈ విషయం తెలిసి చంద్రబాబు జనసేనతో పొత్తుకు ఎలా ప్రయత్నిస్తున్నారో అర్ధం కావటంలేదు.

ఒకవేళ పెట్టుకుంటే రెండు పార్టీలతో పొత్తు పెట్టుకోవాలి. బీజేపీతో పొత్తుకు చంద్రబాబు చాలా ప్రయత్నాలే చేస్తున్నారు. కానీ బీజేపీ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. ఎన్నికల ముందు గెలుపు గుర్రాలెవరు అనే అంచనాలపై నిర్ణయం తీసుకోవచ్చు. అది జరగనంత వరకు బీజేపీతో మిత్రపక్షంగా ఉన్నంతవరకు జనసేనతో టీడీపీ పొత్తు సాధ్యం కాదు. ఒకవేళ జనసేనతో పొత్తు పెట్టుకోవాలంటే బీజేపీతో జనసేన విడిపోవాల్సిందే. మిత్రపక్షాలు విడిపోతే కానీ చంద్రబాబు-పవన్ పొత్తు సాధ్యం కాదు. అంటే జనేసేనతో పొత్తుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నా పవనే పట్టించుకోవటం లేదని అర్ధమవుతోంది.

అందుకనే జనసేనను టీడీపీ ప్రేమిస్తున్నా జనసేన కలిసి రావటం లేదని చంద్రబాబు చెప్పారు. అంటే ఒకవైపు చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవటానికి బీజేపీనే కాదు చివరకు జనసేన కూడా ఇష్టపడటం లేదన్నది స్పష్టమవుతోంది. మరి ఇదే పరిస్థితి వచ్చే ఎన్నికల వరకు కంటిన్యూ అయితే చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. నిజానికి తెలుగుదేశం నేతలు ఒంటరి పోటీనే కోరుకుంటున్నారు. పొత్తు వల్ల తమ సీట్లకు ఎసరు వస్తుందని వారి భావన. కానీ గెలుపు సాధించే తీరాలన్నది చంద్రబాబు ఆలోచన.