సాహోను గుడ్డిగా న‌మ్మేయొచ్చా?

సాహోను గుడ్డిగా న‌మ్మేయొచ్చా?

ఇండియ‌న్ బాక్సాఫీస్‌ను షేక్ చేయ‌డానికి సాహో సిద్ధం అయిపోయింది. ఈ సినిమాకు టాక్ ఎలా ఉన్న‌ప్ప‌టికీ ఓపెనింగ్స్ మోత మోగిపోవ‌డం ఖాయం. బాహుబ‌లికి దీటుగా ఇది ఆరంభ వ‌సూళ్లు సాధించొచ్చ‌న్న అంచ‌నాలున్నాయి.

తెలుగులో మాత్ర‌మే కాక‌.. మిగ‌తా భాష‌ల్లోనూ దీనికి బంప‌ర్ క్రేజ్ క‌నిపిస్తోంది. బుకింగ్స్ ఇలా ఓపెన్ చేస్తే అలా టికెట్లు అమ్ముడైపోవ‌డం ఖాయం అనిపిస్తోంది. వీకెండ్ వ‌ర‌కు టికెట్లేమీ మిగిలే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. వారాంతం త‌ర్వాత సోమ‌వారం వినాయ‌క చ‌వితి సెల‌వు కూడా క‌లిసొచ్చేదే. కాబ‌ట్టి చాలా చోట్ల‌ వ‌సూళ్లలో కొత్త రికార్డులు న‌మోద‌వ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

పెద్ద ద‌ర్శ‌కుడు లేడు. నిర్మాణ సంస్థ అనుభ‌వం కూడా త‌క్కువే. కేవ‌లం ప్ర‌భాస్ పేరు మీద ఈ సినిమాకు ఇంత క్రేజ్ రావ‌డం అంటే గొప్ప విష‌య‌మే.

ఐతే ఓపెనింగ్స్ ఎంత గొప్ప‌గా వ‌చ్చినా.. టాక్ డివైడ్‌గా ఉంటే సాహో అంత ఈజీగా ఏమీ బ్రేక్ ఈవెన్‌కు వ‌చ్చేయ‌దు. బాహుబ‌లి-2 స్థాయిలో దీనిపై బ‌య్య‌ర్లు పెట్టుబ‌డులు పెట్టారు. తెలుగు రాష్ట్రాల్లో రాయ‌ల‌సీమ సంగ‌తే తీసుకుంటే హ‌క్కులు రూ.25 కోట్లు ప‌లికాయి. తొలి నాలుగు రోజుల్లో అద‌న‌పు షోలు వేసుకున్నా, టికెట్ల రేట్లు పెంచుకున్నా కూడా వీకెండ్ వ‌సూళ్ల‌తో బ‌య్య‌ర్లు సేఫ్ అయిపోరు.

రెండో వీకెండ్ వ‌ర‌కు సినిమా నిల‌బ‌డాలి. కాబ‌ట్టి టాక్ కీల‌కం. ప్రోమోలు ఎంత బాగున్న‌ప్ప‌టికీ.. ఎంత విజువ‌ల్ మాయాజాలం చేసిన‌ప్ప‌టికీ.. యాక్ష‌న్ ద‌ట్టించిన‌ప్ప‌టికీ.. రెండున్న‌ర గంట‌లు ప్రేక్ష‌కుల్ని నిల‌బెట్టాలంటే క‌థ బ‌లంగా ఉండాలి. క‌థ‌నం ఆస‌క్తి రేకెత్తించాలి. బాహుబ‌లి లాగా రాజ‌మౌళిని న‌మ్మి ధీమాగా ఉండే అవ‌కాశం ఇక్క‌డ లేదు.

అద‌న‌పు హంగుల్ని దాటి ప్రేక్ష‌కుల్ని క‌ట్టిప‌డేసే ఎమోష‌న్ సినిమాలో ఉంటేనే మ‌న‌గ‌లుగుతుంది. మ‌రి కుర్ర సుజీత్ ఆ మ్యాజిక్ చేయ‌గ‌ల‌డా? బాహుబ‌లిని న‌మ్మిన‌ట్లు సాహోను గుడ్డిగా న‌మ్మ‌గ‌ల‌మా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English