రీమేక్‌ను నమ్ముకున్న నందమూరి హీరో

రీమేక్‌ను నమ్ముకున్న నందమూరి హీరో

నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్ ఒక అడుగు ముందుకు.. రెండు మూడు అడుగులు వెనక్కి అన్నట్లుగా సాగుతోంది చాలా ఏళ్లుగా. చాలా కాలం తర్వాత ‘పటాస్’తో హిట్టు కొట్టి ఫాలోయింగ్ సంపాదించిన కళ్యాణ్ రామ్.. ఇక హీరోగా నిలదొక్కుకున్నట్లే అనుకున్నారంతా. కానీ మళ్లీ వరుస ఫ్లాపులతో అల్లాడిపోయాడు. ఈ ఏడాది ‘118’ సినిమా అతడికి కాస్త ఊపిరి పీల్చుకునే అవకాశమిచ్చింది. అది పెద్ద హిట్టవ్వకపోయినా.. ఫ్లాప్ కాకుండా యావరేజ్‌గా ఆడటం నందమూరి హీరోకు ఊరటనిచ్చింది.

ఇప్పుడతను ఫ్యామిలీ సినిమాల దర్శకుడు సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ప్రముఖ ఆడియో సంస్థ ఆదిత్య మ్యూజిక్ ఈ చిత్రంతోనే నిర్మాణంలోకి అడుగు పెడుతోంది. ఈ చిత్రానికి ‘ఎంత మంచివాడవయ్యా’ అనే టైటిల్ కూడా ఖరారు చేశారు.

ఇది ‘శతమానం భవతి’, ‘శ్రీనివాస కళ్యాణం’ తరహాలోనే సతీశ్ వేగేశ్న మార్కు ఒరిజినల్ మూవీ అని అనుకున్నారంతా. కానీ ఇది రీమేక్ అనే విషయం తాజాగా వెల్లడైంది. గుజరాతీలో విజయవంతమైన ‘ఆక్సిజన్’ అనే ఫ్యామిలీ మూవీని తెలుగు కోసం అడాప్ట్ చేసుకున్నాడట సతీశ్. ఐతే మూల కథ మాత్రమే తీసుకుని.. దానికి తనదైన ట్రీట్మెంట్ ఇస్తున్నాడట ఈ దర్శకుడు.

ఈ చిత్రంలో మెహ్రీన్ పిర్జాదా కథానాయికగా నటిస్తోంది. కళ్యాణ్ రామ్ కెరీర్లో ఫ్యామిలీ మూవీస్ చాలా తక్కువే. అతడికి ఫ్యామిలీ సినిమాలు సెట్టవుతాయా అన్న సందేహాలు కూడా ఉన్నాయి. మరి ఈ సినిమాలో అతనెలా చేస్తాడో చూడాలి. ‘ఎంత మంచివాడవయ్యా’ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయాలన్న ఆలోచనతో ఉన్నారు. కానీ ఆ పండక్కి విపరీతమైన పోటీ ఉన్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని కచ్చితంగా ఆ సీజన్లోనే రిలీజ్ చేస్తారన్న గ్యారెంటీ లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English