తెలుగు ప్రేక్షకులకు పరీక్ష పెట్టేసిన ఐశ్వర్య

తెలుగు ప్రేక్షకులకు పరీక్ష పెట్టేసిన ఐశ్వర్య

కొన్ని సినిమాలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయో.. ఎప్పుడు విడుదల అవుతాయో కూడా పెద్దగా ప్రచారం సాగదు. కానీ.. సదరు సినిమా రిలీజ్ అయ్యాక మాత్రం ఆ సినిమా మీద పాజిటివ్ ఫీడ్ బ్యాక్ రావటం.. ఆ సినిమా గురించి అంతా మాట్లాడుకోవటం జరుగుతుంది. ఇలాంటి చిత్రాలన్ని భారీ బడ్జెట్ సినిమాలు కాకుండా.. లో బడ్జెట్ సినిమాలకే పరిమితం అనుకుంటే తప్పులో కాలేసినట్లే.

‘కౌసల్య కృష్ణమూర్తి.. ది క్రికెటర్‌’ చిత్రం విషయానికి వస్తే.. ఈ సినిమాకు సంబంధించి పెద్ద బజ్ లేదనే చెప్పాలి. భీమనేని శ్రీనివాసరావు లాంటి దర్శకుడు దర్శకత్వం వహించినా.. ప్రముఖ నిర్మాత కేఎస్ రామారావు సమర్పణలో విడుదలైన ఈ చిత్రాన్ని తెలుగు మీడియా లైట్ తీసుకుందనే చెప్పాలి. మహిళా క్రికెటర్ కథనంలో రూపొందించిన ఈ సినిమాలో లీడ్ రోల్ ప్లే చేసిన ఐశ్వర్యా రాజేశ్ అసలుసిసలు తెలుగమ్మాయ్. కాకుంటే.. చెన్నైలో పుట్టి పెరిగింది.

చాలామంది తెలుగు హీరోయిన్లకు మించి అచ్చ తెలుగులో మాట్లాడే ఐశ్వర్యా.. తమిళంలో మంచి గుర్తింపు పొందిన నటిగా చెప్పాలి.  తమిళంలో తాను చేసిన సినిమా రీమేక్ అయినప్పటికీ.. సినిమా బాగా రావాలన్న ఉద్దేశంతో మహిళా క్రికెట్ కోచ్ ను పెట్టుకొని మరీ మరోసారి ప్రాక్టీస్ చేసిందట. అంతేకాదు.. ఈ చిత్ర షూటింగ్ దాదాపుగా ఒకప్పటి రాజమండ్రి ఇప్పటి రాజమహేంద్రనగరిలో జరిగింది. అక్కడి ఎండలు ఎలా ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే ఉండదు.

అలాంటి ఎండల్లో రోజుకు ఎడెనిమిది గంటల పాటు ఈ సినిమా కోసం ఐశ్వర్య కష్టపడిందట. తానింత కష్టపడింది కాబట్టి.. ఈ సినిమాతో తనకు తెలుగులో మంచి పేరు వస్తుందని నమ్మకంగా ఉందని పేర్కొంది. మరి.. ఈ తెలుగు టాలెంట్ ను తెలుగు ప్రేక్షకులు ఎంతమేర ఆదరిస్తారో చూడాలి. చూస్తుంటే.. టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తూనే.. తెలుగు ప్రేక్షకులకు ఐశ్వర్యా పెద్ద పరీక్ష పెట్టినట్లే చెప్పాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English