కర్నూల్లో నిజమైన శ్రీమంతుడు

పది రూపాయిలకు పేచీ పడి ప్రాణాలు తీస్తున్న పాడు రోజులవి. ఆస్తి కోసం తల్లిదండ్రుల్ని పిల్లలు.. భార్యను భర్త.. భర్తను భార్య.. అన్నను తమ్ముడు.. తమ్ముడ్ని అన్న.. ఇలా చెప్పుకుంటూ డబ్బుల కోసం జరుగుతున్న దారుణాలు అన్నిఇన్ని కావు. అలాంటిది.. అందుకు భిన్నంగా రూ.6 కోట్లు విలువ చేసే 12 ఎకరాల భూమిని పేదల కోసం దానం చేయటం మామూలు విషయం కాదు.

అలాంటి సినిమాటిక్ సీన్ తాజాగా కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. ఇంత చేశాడంటే.. కచ్ఛితంగా ఏదో రాజకీయ ఎజెండా ఉందని అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే.. రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమం జరిగింది. కర్నూలు జిల్లాలోని తుగ్గలికి చెందిన రాష్ట్ర శాలివాహన సంఘం అధ్యక్షుడు నాగేంద్ర.. ఆయన సతీమణి వరలక్ష్మి దంపతులు పేదల సొంతింటి కలను తీర్చాలని భావించారు.

అందుకోసం తమ వంతుగా ఏమైనా చేద్దామనుకున్నారు.
ఇందులో భాగంగా 12 ఎకరాల భూమిని 670 మందికి ఇళ్ల స్థలాలుగా మార్చి పంపిణీ చేశారు. ఇందుకోసం తాజాగా ఒక కార్యక్రమాన్ని చేపట్టటంతో ఈ విశేషాన్ని చూసేందుకు భారీగా ప్రజలు తరలి వచ్చారు. ఎలాంటి ఖర్చులు లేకుండా రిజిస్ట్రేషన్ చేయిస్తూ అందరి మనసుల్ని దోచుకున్నారు.

ఈ కార్యక్రమానికి వైసీపీ.. టీడీపీ.. బీజేపీ.. సీపీఐ.. ఎమ్మార్పీఎస్ తదితర పార్టీల నేతలంతా హాజరయ్యారు. రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ కార్యక్రమాల్ని నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఏమైనా.. కోట్లాది రూపాయిల విలువైన భూమిని పేదలకు సొంతింటి కోసం దానం చేయటం చూస్తే.. రీల్ లో చూసే దానికి మించిన రియల్ శ్రీమంతులు ఈ దంపతులు అని చెప్పక తప్పదు.