చిరుపై నెగెటివిటీ అంతా పోయినట్లేనా?

చిరుపై నెగెటివిటీ అంతా పోయినట్లేనా?

మెగాస్టార్ చిరంజీవి సినీ రంగంలో చేరిన ఎత్తుల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. దాదాపు మూడు దశాబ్దాలు తిరుగులేని నంబర్‌వన్‌గా ఉన్నారాయన. ఎవరో అన్నట్లుగా ఒకప్పుడు టాలీవడ్లో 1 నుంచి 10 స్థానాల వరకు చిరువే అంటే అతిశయోక్తి కాదు. నటుడిగానే కాక వ్యక్తిగానూ చిరు జనాల హృదయాల్లో బలమైన స్థానం సంపాదించుకున్నాడు.

ఆ మంచి పేరును ఉపయోగించుకుని రాజకీయాల్లోనూ శిఖరాల్ని అందుకోవాలని చూశాడు చిరు. కానీ ఆయన ఆశ నెరవేరలేదు. సినీ రంగంలో ఎంతో కష్టపడి సాధించుకున్న పేరును కూడా రాజకీయాల్లోకి వచ్చి దెబ్బ తీసుకున్నాడు చిరు. ఎన్నికల ముంగిట టికెట్లు అమ్ముకున్నాడన్న ఆరోపణలకు తోడు పార్టీని రెండేళ్లలోనే మూసేసి కాంగ్రెస్‌లో విలీనం చేయడంతో చిరును తిట్టుకోని వారు లేరు. అందరికీ ఎక్కువ కోపం తెప్పించిన విషయంలో పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడమే.

కాంగ్రెస్‌లో చేరాక ఎంపీ అయి మంత్రి పదవిని కూడా చేపట్టిన చిరు.. మంత్రిగా ఉన్నంత కాలం కూడా జనాల్లో తన పట్ల అభిప్రాయాల్ని మార్చలేకపోయాడు. తన జీవితంలో ఎన్నడూ లేనంత నెగెటివిటీని మూటగట్టుకున్నాడు. మళ్లీ సినిమాల్లోకి వస్తున్నా అన్నపుడు కూడా చిరును ప్రతికూల కోణంలోనే చూశారు జనాలు. ఐతే ఆయన రీఎంట్రీ మూవీ ‘ఖైదీ నంబర్ 150’ రిలీజ్ తర్వాత పరిస్థితులు మారాయి.

నెమ్మదిగా పొలిటీషియన్‌ చిరును జనాలు మరిచిపోవడం మొదలుపెట్టారు. రోజులు గడిచేకొద్దీ జనాలు దేన్నయినా మరిచిపోతారు అనడానికి చిరునే ఉదాహరణగా నిలిచాడు. క్రమంగా ఆయన పట్ల జనాల అభిప్రాయం మారి.. ఇప్పుడు దాదాపుగా నెగెటివిటీ అంతా పోయినట్లే కనిపిస్తోంది. ఇప్పుడు చిరును ఒక నటుడిగా మాత్రమే చూస్తున్నారు.

గురువారం చిరు పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియా ట్రెండ్స్‌ను పరిశీలిస్తే.. ఒకప్పుడు ఆయన పడ్డ కష్టం, ఆయన జనాల్ని ఎంటర్టైన్ చేసిన వైనాన్ని గుర్తు చేసుకుంటూ జనాలు నోస్టాల్జిక్‌గా ఫీలవుతున్న విషయం స్పష్టమవుతోంది. మొత్తానికి జనాల మెదళ్లలోంచి పొలిటీషియన్ చిరు పూర్తిగా పక్కకు వెళ్లిపోయి ‘మెగాస్టార్ చిరు’ను మాత్రమే గుర్తిస్తున్నారని స్పష్టమవుతోంది. ‘సైరా’ అంచనాల్ని అందుకుని పెద్ద హిట్టయితే ఇక చిరుకు తిరుగుండదేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English