బిగ్-బి కి చిరు అంటే ఎందుకింత ప్రేమ

బిగ్-బి కి చిరు అంటే ఎందుకింత ప్రేమ

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌ను దక్షిణాదిన నటించాలని గతంలో ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. మన దగ్గర్నుంచి నందమూరి బాలకృష్ణ సైతం వెళ్లి ‘రైతు’ సినిమాలో ఓ పాత్ర కోసం ఆయన్ని అడిగాడు. కానీ బిగ్-బి ఒప్పుకోలేదు. మీరు కాదంటే ఈ సినిమానే చేయం అన్నా కూడా అమితాబ్ కనికరించలేదు. దీంతో ఆ ప్రాజెక్టు పక్కన పడిపోయింది.

ఐతే మెగాస్టార్ చిరంజీవి అడిగితే మాత్రం బిగ్-బి కాదనలేకపోయారు. ‘సైరా నరసింహారెడ్డి’లో ఉయ్యాలవాడ గురువుగా కీలక పాత్ర చేయడానికి అంగీకరించారు. ఈ పాత్ర కోసం అమితాబ్ పారితోషకం కూడా తీసుకోలేదన్న ప్రచారం జరిగింది. అదెంత వరకు నిజమో కానీ.. ముంబయి నుంచి షూటింగ్ కోసం రాను పోను విమాన టికెట్ల డబ్బులు ఇచ్చినా కూడా ఆయన తిరస్కరించినట్లుగా ‘సైరా’ నిర్మాత రామ్ చరణ్ చెబుతుండటం విశేషం.

‘సైరా’ ప్రమోషన్ల కోసం ముంబయికి వెళ్లి వచ్చిన చిరు, చరణ్.. ఈ సందర్భంగా ఓ ఇంగ్లిష్ డైలీతో మాట్లాడారు. అమితాబ్ గురించి చరణ్ స్పందిస్తూ.. ‘‘ఆయన మా వద్ద విమానం టికెట్ల డబ్బులు తీసుకోవడానికి కూడా నిరాకరించారు. మేం కూడా బలవంతం చేయలేకపోయాం’’ అని చెప్పాడు.

దీని గురించి చిరు వివరిస్తూ.. ‘‘అమితాబ్‌ హైదరాబాద్ వచ్చి వెళ్లడానికి ప్రైవేట్ జెట్‌ ఏర్పాటు చేద్దామనుకున్నాం. కానీ ఆయన దానికి కూడా ఒప్పుకోలేదు. బస విషయంలో కూడా ప్రత్యేక ఏర్పాట్లేమీ వద్దన్నారు. ఈ సినిమా స్నేహం కోసం చేస్తున్నట్లుగా చెప్పారు. ఆయనకు నేను చాలా రుణపడిపోయాను. మా ఇద్దరికీ చాలా ఏళ్లుగా పరిచయం ఉంది. ఒక మెసేజ్ పెట్టగానే ఆయన ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. ‘సైరా’లో పాత్ర గురించి ఫోన్ చేసి చెబితే ‘నాకు తెలుగు రాదు’ అన్నారు. ‘పర్వేలేదు. మీకు ఏ భాషలో సౌకర్యంగా ఉంటే అందులో డైలాగ్ చెప్పండి’ అని చెప్పాను. దీంతో ఆయన సినిమాకు ఓకే చెప్పారు’’ అని చిరు తెలిపాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English