జేమ్స్ బాండ్ మళ్లీ వస్తున్నాడహో..

జేమ్స్ బాండ్ మళ్లీ వస్తున్నాడహో..

జేమ్స్ బాండ్ సిరీస్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ ఎలాంటిదో తెలిసిందే. దశాబ్దాలుగా ఈ క్యారెక్టర్ యాక్షన్ ప్రియుల్ని అలరిస్తోంది. దశాబ్దంన్నర నుంచి ఈ సిరీస్‌లో డేనియల్ క్రెయిగ్ జేమ్స్ బాండ్ పాత్రలో అలరిస్తున్నాడు. మధ్యలో ఈ పాత్రకు టాటా చెప్పేయాలని క్రెయిగ్ అనుకున్నాడు కానీ.. మళ్లీ ఆ ఆలోచనను విరమించుకున్నాడు.

బాండ్ సిరీస్‌లో కొత్త సినిమాకు ముందు ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ ఫేమ్ డానీ బోయెల్‌ను దర్శకుడిగా అనుకున్నారు కానీ.. ఆ తర్వాత అతడి స్థానంలోకి కేరీ జోజి వచ్చాడు. వీళ్ల కలయికలో రానున్న బాండ్ సినిమాకు ‘నో టైమ్ టు డై’ అనే టైటిల్ ఖరారు చేశారు. అంతే కాదు.. ఈ చిత్ర రిలీజ్ డేట్‌ను కూడా ఫిక్స్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా 2020 ఏప్రిల్ 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇండియాలో మాత్రం ఐదు రోజుల ముందే.. అంటే ఏప్రిల్ 3న రిలీజవుతుందని ప్రకటించారు. ఇది బాండ్ సిరీస్‌లో 25వ సినిమా. బాండ్ సిినమాల్లో ఇదే చివరిది కావచ్చన్న ప్రచారం కూడా జరుగుతోంది. 2006లో ‘క్యాసినో రాయల్’తో డేనియల్ క్రెయిగ్ బాండ్ అవతారం ఎత్తాడు. ఆ తర్వాత ‘క్వాంటమ్ ఆఫ్ సోలెస్’, ‘స్కై ఫాల్’, ‘స్పెక్టర్’ సినిమాల్లో బాండ్‌గా కనిపించాడు.

బాండ్ సినిమాల్లో కష్టానికి తట్టుకోలేక.. ఇక తాను ఈ సిరీస్‌లో నటించలేనని అన్నాడు క్రెయిగ్. ‘స్పెక్టర్’ ప్రమోషన్లలో ఈ మాట అన్నాడు. అతడి స్థానంలో బ్రిటిష్ నటుడు ఇద్రీస్‌ను తీసుకున్నట్లుగా ప్రచారం జరిగింది కానీ.. అది నిజం కాలేదు. ఎలాగోలా క్రెయిగ్‌నే మళ్లీ బాండ్‌గా ఒప్పించారు.

కొత్త సినిమా కోసం క్రెయిగ్ దాదాపు రూ.600 కోట్లు పారితోషకంగా తీసుకుంటున్నట్లు సమాచారం. ‘నో టైమ్ టు డై’ ఫలితాన్ని బట్టి ఈ సిరీస్‌ను ఆపాలా కొనసాగించాలా అనేది నిర్ణయిస్తుందేమో నిర్మాణ సంస్థ.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English