ఇలాంటి క్లాసిక్.. అతడితోనా?

ఇలాంటి క్లాసిక్.. అతడితోనా?

హిందీలో గత ఏడాది అద్భుత విజయం సాధించిన చిత్రాల్లో ‘అందదున్’ ఒకటి. గత ఏడాది అనే కాదు.. ఇండియన్ సినిమా చరిత్రలోనే బెస్ట్ థ్రిల్లర్లలో దీన్ని ఒకటిగా చెప్పొచ్చు. అనేక మలుపులు తిరుగుతూ.. ప్రేక్షకులకు షాకుల మీద షాకులిస్తూ.. వాళ్లను ఆద్యంతం గెస్సింగ్‌లో ఉంచూతూ ఉత్కంఠభరితంగా సాగుతుందీ థ్రిల్లర్.

ఓ మర్డర్ మిస్టరీ చుట్టూ తిరిగే థ్రిల్లర్ చిత్రమిది. పియానో నేర్చుకోవడం కోసం అంధుడిగా నటిస్తూ.. అనుకోని పరిస్థితుల్లో నిజంగానే అంధుడిగా మారిపోయే పాత్రలో ఒదిగిపోయిన హీరో ఆయుష్మాన్ ఖురానా.. ఇటీవలే జాతీయ అవార్డు కూడా అందుకున్నాడు.

ఈ చిత్రాన్ని దక్షిణాది భాషల్లో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ముందుగా తమిళ వెర్షనే వార్తల్లో నిలిచింది. ఈ చిత్రంలో ధనుష్ నటిస్తాడని ముందు వార్తలొచ్చాయి. అదే నిజమైతే భలేగా ఉండేది.

కానీ ఆ వార్త నిజం కాదని తేలుస్తూ.. అందదున్ రీమేక్ విషయంలో ప్రేక్షకుల ఆశలపై నీళ్లు చల్లుతూ దర్శక నిర్మాత త్యాగరాజన్ ఒక అనౌన్స్‌మెంట్ ఇచ్చాడు. ఈ సినిమా రీమేక్ హక్కులు తానే కొన్నానని.. తన కొడుకు ప్రశాంత్ హీరోగా ఈ చిత్రాన్ని రీమేక్ చేయబోతున్నామని ఆయన ప్రకటించాడు. ప్రశాంత్ తమిళంలో ఎప్పుడూ స్టార్ కాదు. అతడికేమంత గొప్ప ఇమేజ్ లేదు.

‘జీన్స్’ లాంటి ఒకటీ అరా సినిమాలు మాత్రమే అతడికి గుర్తింపు తెచ్చాయి. గత పది పదిహేనేళ్లలో అతడి సినిమా ఒక్కటీ ఆడలేదు. 46 ఏళ్ల ప్రశాంత్ ఇప్పుడు క్యారెక్టర్ రోల్స్ ఏవో చేసుకుంటున్నాడు. తెలుగులో ఈ మధ్యే ‘వినయ విధేయ రామ’లోనూ నటించాడు. నటుడిగా అతడికేమంత మంచి పేరు లేదు. పైగా ఔట్ డేట్ అయిపోయాడు.

మరి ‘అందదున్’ లాంటి ట్రెండీ థ్రిల్లర్లో అతను నటిస్తే ప్రేక్షకులకు ఏం ఆసక్తి ఉంటుంది? ఈ విషయంలో ఇప్పటికే సోషల్ మీడియాలో నెగెటివిటీ కనిపిస్తోంది. ధనుష్ అనుకుంటే ప్రశాంత ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. మరి ప్రశాంత్, త్యాగరాజన్‌ల ధైర్యమేంటో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English