మెహర్ రమేష్ ఈజ్ బ్యాక్?

మెహర్ రమేష్ ఈజ్ బ్యాక్?

మెహర్ రమేష్.. ఈ పేరు ఎత్తితే తెలుగు ప్రేక్షకులు ఒకింత అలజడికి గురవుతారు. ఒక కంత్రి.. ఒక శక్తి.. ఒక షాడో.. ఒకదాన్ని మించిన డిజాస్టర్ ఒకటి. ఒక సినిమా పోయినా.. ఏమాత్రం వెనకడుగు వేయక ఇంకా భారీ ఖర్చుతో ఈ చిత్రాల్ని రూపొందించి.. బాక్సాఫీస్ దగ్గర దారుణ పరాభవం ఎదుర్కొని.. నిర్మాతల్ని నిలువునా ముంచేసి పెద్ద విలన్ అయ్యాడు మెహర్.

అతను తీసిన రీమేక్ మూవీ ‘బిల్లా’ మాత్రం ఒక మాదిరిగా ఆడింది కానీ.. మిగతావన్నీ దారుణమైన ఫలితాలందుకున్నాయి. ఘనమైన చరిత్ర ఉన్న వైజయంతీ మూవీస్ సంస్థ ఒక దశలో సినిమాలు మానేసి సైలెంటైపోవడానికి కారకుడు మెహర్ రమేషే. ‘శక్తి’ లాంటి ఆల్ టైం డిజాస్టర్ తర్వాత కూడా అతను తప్పులు దిద్దుకోకుండా భారీ బడ్జెట్లో ‘షాడో’ లాంటి చెత్త సినిమా తీసి పూర్తిగా బ్యాడ్ అయిపోయాడు.

ఇక అప్పట్నుంచి మెహర్ రమేష్‌ను నమ్మి ఎవరూ సినిమాలివ్వలేదు. ఐతే మెగా ఫ్యామిలీతో, మహేష్ బాబుతో ఉన్న కనెక్షన్ల వల్ల ఏవో కమర్షియల్స్, ఇంకేవో ప్రాజెక్టులు చేసుకుంటూ కాలం గడిపేస్తున్నాడు. ఐతే సుదీర్ఘ విరామం తర్వాత మెహర్ మళ్లీ దర్శకత్వానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. ఐతే ఈసారి అతను తీయబోయేది సినిమా కాదు.. వెబ్ సిరీస్ అట. సీనియర్ నటుడు జగపతిబాబు ప్రధాన పాత్రలో అతనీ వెబ్ సిరీస్ తీయనున్నాడట. ఒక కార్పొరేట్ సంస్థ ఈ వెబ్ సిరీస్ తీయడానికి ముందుకొచ్చినట్లు సమాచారం. ఇంతకుమించి వివరాలేమీ తెలియవు.

జగపతిబాబు ఇప్పటికే ‘గ్యాంగ్‌స్టర్స్’ అనే వెబ్ సిరీస్‌ చేశాడు. భవిష్యత్తు వీటిదే అని అర్థం చేసుకున్న ఆయన.. మరిన్ని సిరీస్‌లు చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలోనే మెహర్ ఆయన్ని మెప్పించినట్లు తెలుస్తోంది. మరి ఇక్కడైనా మెహర్ బడ్జెట్ హంగుల మీద కాకుండా కంటెంట్ మీద దృష్టిపెట్టి మంచి ఔట్ పుట్ ఇస్తాడేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English