‘సైరా’ను భయపెడుతున్న సినిమాకు కష్టాలు

‘సైరా’ను భయపెడుతున్న సినిమాకు కష్టాలు

అనుకున్నట్లే అక్టోబరు 2కు ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా ఫిక్సయింది. ఈ చిత్రాన్ని తెలుగులోనే కాదు.. హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ‘బాహుబలి’ తరహాలో ఉత్తరాది మార్కెట్‌ను కొల్లగొట్టాలన్నది చిత్ర బృందం ప్లాన్‌గా కనిపిస్తోంది. అందుకే అనిల్ తడాని, ఫర్హాన్ అక్తర్ లాంటి పెద్ద నిర్మాతల్ని లైన్లో పెట్టి ఈ సినిమాను వాళ్ల ద్వారా రిలీజ్ చేయిస్తున్నారు.

నిన్న ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని ముంబయిలో ఘనంగా నిర్వహించి అక్కడి మీడియాలో ‘సైరా’ గురించి చర్చ జరిగేలా చేశారు. రిలీజ్ కూడా కొంచెం పెద్ద స్థాయిలోనే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ ఆ రోజుకు ఓ పెద్ద హిందీ సినిమా ‘సైరా’కు పంచ్ ఇస్తుందేమో అన్న భయం చిత్ర బృందంలో లేకపోలేదు. ఆ సినిమానే.. వార్.

హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్‌ల కలయికలో తెరకెక్కుతున్న యాక్షన్ మూవీ ‘వార్’. ‘సాహో’ స్టయిల్లోనే హాలీవుడ్ యాక్షన్ సినిమాలకు దీటుగా తెరకెక్కిందీ చిత్రం. హృతిక్‌తో ‘బ్యాంగ్ బ్యాంగ్’ సినిమా తీసిన సిద్దార్థ్ ఆనంద్.. యశ్ రాజ్ ఫిలిమ్స్ బేనర్లో భారీ ఎత్తున ఈ చిత్రాన్ని రూపొందించాడు. టీజర్ యాక్షన్ ప్రియుల్ని ఉర్రూతలూగించింది. కాకపోతే ఈ సినిమాకు పెద్ద చిక్కొచ్చి పడింది. నిర్మాతలకు ఇండియా వైడ్ డిస్ట్రిబ్యూటర్లకు మధ్య పేచీ నడుస్తోంది.

యశ్ రాజ్ ఫిలిమ్స్ నుంచి గత ఏడాది వచ్చిన ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ మీద భారీ అంచనాలుండటంతో అందుకు తగ్గట్లే రేట్లకు సినిమాను అమ్మారు. కానీ ఆ చిత్రం బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టింది. బయ్యర్లను నిలువునా ముంచేసింది. కొంత మేర నష్టాల్ని భర్తీ చేయమంటే యశ్ రాజ్ సంస్థ కుదరదంది. ఇప్పుడు ‘వార్’ చిత్రాన్ని తక్కువ రేట్లకు ఇవ్వమన్నా ససేమిరా అంటున్నాడట ఆదిత్య చోప్రా.

దీంతో బయ్యర్లందరూ సిండికేట్ అయి సినిమాను కొనొద్దన్న నిర్ణయానికి వచ్చారు. దీంతో సినిమా విడుదల సందిగ్ధంలో పడింది. మరి ఈ సమస్యను పరిష్కరించుకుని యధావిధిగా అక్టోబరు 2నే సినిమాను రిలీజ్ చేసి ‘సైరా’కు ఇబ్బందులు సృష్టిస్తారో లేక.. వాయిదా వేసి ‘సైరా’కు ఊరటనిస్తారో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English