త్రివిక్రమ్ కి టైటిల్ కష్టాలేంటో!

త్రివిక్రమ్ కి టైటిల్ కష్టాలేంటో!

నువ్వే నువ్వే, అతడు, జల్సా అంటూ ముఖమ్మీద కొట్టినట్టు ఒక్క మాటలో తన సినిమా టైటిల్ ని చెప్పేసేవాడు త్రివిక్రమ్. అలాంటిది ఏమయ్యిందో ఏమో కానీ, పవన్ కళ్యాణ్ తో సినిమా మొదలెట్టినప్పట్నుంచీ చిత్ర విచిత్రమైన విన్యాసాలు చేస్తున్నాడు. ఆ పేరు, ఈ పేరు అంటూ చివరకు అత్తారింటికి దారేది అన్నాడు. ఆ టైటిల్ వినగానే ఇదేదో ఆడాళ్ల సినిమాలా ఉందేంటి అంటూ అందరూ ఫక్కుమన్నారు. ఆనక తీరిగ్గా పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ ల మీద జోకులు పేల్చి నవ్వుకున్నారు. పవన్ కళ్యాణ్ పెద్దగా స్పందించలేదు కానీ, సన్నిహితులంతా టైటిల్ మార్చమని దర్శకుడి మీద ఒత్తిడి తెచ్చారు. దాంతో త్రవిక్రమ్ ఆలోచనలో పడేసరికి, హమ్మయ్య, ఏదో మంచి పేరు పెడతాడులే అని ఫ్యాన్సంతా ఊపిరి పీల్చుకున్నారు.

అయితే అతడు చెప్పిన టైటిల్ విని మరోసారి నవ్వలేక ఏడుస్తున్నారు. ఇంతకీ అతడు పెట్టిన కొత్త టైటిల్ ఏమిటనుకున్నారు... 'చిన్నల్లుడా మజాకా'! షాకయ్యారు కదూ. పవన్ ఫ్యాన్స్ పరిస్థితి కూడా అదే. అల్లుడా మజాకా, చిన్నల్లుడు సినిమాల టైటిల్స్ ని మిక్స్ చేసి కొడితే షాకవక ఏం చేస్తారు చెప్పండి! టైటిల్ తట్టక ఇలాంటి విచిత్రాలు చేస్తున్నాడా లేక సినిమా కథే అలా తగలడిందా కొంపదీసి అనే అనుమానాలు వస్తున్నాయి త్రివిక్రమ్ టైటిల్స్ వింటే అంటూ ఓ అమాయక ఫ్యాన్ తన బ్లాగులో రాసుకున్నాడు. ఇంతకీ టైటిల్ గురించి త్రివిక్రమ్ ఇన్ని తంటాలు ఎందుకు పడుతున్నట్టు!

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు