అక్కినేని లెగ‌సీని ఎక్క‌డిదాకా తీసుకెళ్తారో?

అక్కినేని లెగ‌సీని ఎక్క‌డిదాకా తీసుకెళ్తారో?

అక్కినేని వారి కష్టాలు ఎంతకీ తీరట్లేదు. రోజు రోజుకూ ఆ ఫ్యామిలీ హీరోల రేంజ్ పడిపోతోంది. మార్కెట్ దెబ్బ తినేస్తోంది. ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గుతూ వస్తోంది. అక్కినేని నాగేశ్వరరావు ఘన వారసత్వాన్ని కొనసాగిస్తూ ఒకప్పుడు టాప్ హీరోల్లో ఒకడిగా ఉండేవాడు నాగార్జున. కానీ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి తర్వాతి తరం స్టార్లు.. ఆపై వచ్చిన యువ కథానాయకుల జోరుతో సీనియర్లందరికీ ఇబ్బందులు తప్పలేదు. నాగ్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఐతే రేంజ్ కొంచెం తగ్గినా అడపాదడపా హిట్లతో నాగ్ బండి బాగానే నడుస్తుండేది.

మూడేళ్ల కిందట ‘సోగ్గాడే చిన్నినాయనా’తో కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ కూడా కొట్టాడు నాగ్. కానీ ఆ విజయాన్ని నిలబెట్టుకోవడంతో నాగ్ విఫలమయ్యాడు. తనకు తగని పాత్రలు ఎంచుకుని ఎదురు దెబ్బలు తిన్నాడు. ముఖ్యంగా ‘ఆఫీసర్’ సినిమా నాగ్ కెరీర్‌ను గట్టి దెబ్బే తీసింది. ఆయన మార్కెట్ బాగా పడిపోయింది. ఫ్యాన్స్‌ కూడా నీరుగారిపోయాడు. తర్వాత పుంజుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు.

‘దేవదాస్’ అంచనాల్ని అందుకోలేకపోగా.. తాజాగా ‘మన్మథుడు-2’తో డిజాస్టర్‌ను ఖాతాలో వేసుకున్నాడు నాగ్. విడుదలకు ముందు బజ్ ఉండి కూడా ఈ సినిమా ఉపయోగించుకోలేకపోయింది. డివైడ్ టాక్‌తో కుదేలైంది. ఫుల్ రన్లో రూ.10 కోట్ల లోపే షేర్ సాధించిందీ చిత్రం. దీన్ని బట్టే నాగ్ మార్కెట్ ఎంతగా దెబ్బ తినేసిందో అర్థం చేసుకోవచ్చు. ఈ దశ నుంచి ఆయన ఎలా పుంజుకుంటాడన్నది అర్థం కావడం లేదు.

మరోవైపు నాగచైతన్య కెరీర్ ముందుకు వెనక్కి అన్నట్లు సాగుతోంది. ‘మజిలీ’ అతడి కెరీర్లో పెద్ద హిట్టుగా నిలిచినా అది దర్శకుడి ప్రతిభ, సమంత క్రేజ్ వల్లే తప్ప చైతూ వల్ల కాదన్న వ్యాఖ్యానాలు గట్టిగా వినిపించాయి. సమంత లేకుండా సోలో హీరోగా ఒక పెద్ద హిట్ కొడితే తప్ప చైతూ తనేంటో రుజువు చేసుకున్నట్లు కాదు.

ఇక అఖిల్ సంగతి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. వరుసగా మూడు డిజాస్టర్లతో అతను తిరోగమన దిశలోకి వెళ్లిపోయాడు. తొలి విజయం కోసం తహతహలాడుతున్న అతను నెగెటివిటీని అధిగమించి హీరోగా నిలదొక్కుకోవడం చాలా కష్టంగానే ఉంది. ఇక సుమంత్, సుశాంత్ లాంటి వాళ్ల గురించి మాట్లాడుకోవడానికేమీ లేదు. మొత్తానికి ఘనమైన అక్కినేని లెగసీ ఏమవుతుందో అన్న ఆందోళన అభిమానుల్ని వేధిస్తోందిప్పుడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English