జ‌క్క‌న్న శాపం.. ప్ర‌భాస్ త‌ప్పించుకుంటాడా?

జ‌క్క‌న్న శాపం.. ప్ర‌భాస్ త‌ప్పించుకుంటాడా?

రాజమౌళితో సినిమా చేసే హీరోకు అతడి కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ దక్కుతుంది. కానీ ఆ సక్సెస్ క్రెడిట్లో హీరోకు వచ్చే వాటా మాత్రం చాలా తక్కువ. హీరోల్ని మించి ఇమేజ్ తెచ్చుకున్న జక్కన్నకే విజయంలో ప్రధాన వాటా ఇచ్చేస్తారందరూ. పైగా రాజమౌళితో సినిమా తర్వాత హీరోల రేంజ్ పెద్దగా ఏమీ మారదని.. వాళ్లు ఆ విజయాల్ని నిలబెట్టుకోలేరని ఒక సెంటిమెంటు ఉంది.

జక్కన్నతో సినిమాలు చేశాక ఆయా హీరోల ట్రాక్ రికార్డు చూస్తే ఇది నిజమే అనిపిస్తుంది. రాజమౌళితో చివరగా ‘యమదొంగ’ సినిమా చేశాడు ఎన్టీఆర్. కానీ ఆ తర్వాత కొన్నేళ్ల పాటు వరుస ఫ్లాపులతో సతమతం అయ్యాడు. ‘యమదొంగ’ను మించే సినిమా రావడానికి చాలా టైం పట్టింది. ఇక రామ్ చరణ్ రాజమౌళితో చేసిన ‘మగధీర’తో ఎంత పెద్ద విజయాన్నందుకున్నాడో తెలిసిందే. కానీ ఆ తర్వాత ‘ఆరెంజ్’ లాంటి డిజాస్టర్ ఎదురైంది. చాలా ఏళ్లకు కానీ ‘రంగస్థలం’ లాంటి పెద్ద విజయాన్ని అందుకోలేదు. ‘విక్రమార్కుడు’ తర్వాత రవితేజ పరిస్థితీ అంతే.

ప్రభాస్ సైతం ఇందుకు మినహాయింపు కాదు. ‘ఛత్రపతి’ తర్వాత ఆ స్థాయి విజయమే దక్కలేదు. ఐతే ఇప్పుడు ఈ సెంటిమెంటును ప్రభాసే బ్రేక్ చేస్తాడేమో అని అంతా ఎదురు చూస్తున్నారు. ‘బాహుబలి’ రెండు భాగాల తర్వాత ప్రభాస్ ఇప్పుడు ‘సాహో’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దీనికి సుజీత్ అనే ఒక సినిమా అనుభవమున్న దర్శకుడు డైరెక్షన్ చేశాడు. ఈ సినిమా కేవలం ప్రభాస్ పేరు మీదే దేశవ్యాప్తంగా సేల్ అవుతోంది. ఎన్ని ఆకర్షణలు జోడించినా.. ప్రభాసే అతి పెద్ద ఆకర్షణ.

‘బాహుబలి’తో ప్రభాస్‌కు వచ్చిన క్రేజ్ మొత్తాన్ని వాడుకునే రేంజిలో ఈ సినిమాను సెట్ చేశారు. ఏకంగా రూ.350 కోట్ల బడ్జెట్లో సినిమాను నిర్మించారు. దాని మీద వంద కోట్ల లాభానికి బిజినెస్ చేసుకున్నట్లుగా వార్తలొస్తున్నాయి. దీని ప్రోమోలు చూస్తే ‘బాహుబలి’కి దీటైన విజయం సాధించేలా కనిపిస్తోంది. మరి రాజమౌళితో సినిమా చేశాక ఏ హీరో కూడా దానికి దీటైన సక్సెస్ అందుకోలేడని, ఆ విజయాన్ని నిలబెట్టుకోలేడని ప్రచారంలో ఉన్న సెంటిమెంటును ప్రభాస్ బ్రేక్ చేసి ‘సాహో’తో తన సత్తా చాటుతాడేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English