కాజల్‌ ఇక్కడ ఫట్.. అక్కడ సూపర్ హిట్

కాజల్‌ ఇక్కడ ఫట్.. అక్కడ సూపర్ హిట్

కాజల్ అగర్వాల్‌ టాలీవుడ్ కెరీర్ ఇప్పుడేమంత బాగా లేదు. ఈ ఏడాది వరుసగా రెండు ఫ్లాపులు ఎదుర్కొందామె. వేసవిలో వచ్చిన లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘సీత’ బోల్తా కొట్టింది. తాజాగా ఆమె సినిమా ‘రణరంగం’ కూడా నిరాశాజనక ఫలితం దిశగా అడుగులేస్తోంది. ఈ సినిమాలో ఆమె పాత్రకు అసలేమాత్రం ప్రాధాన్యం లేదు.

సినిమా ఫలితం ఎలా ఉన్నా కళ్యాణి ప్రియదర్శినినే బాగా హైలైట్ అయింది. ఆమె ముందు కాజల్ తేలిపోయింది. విడుదలకు ముందు కాజల్ చెప్పిన కబుర్లన్నీ ఉత్తవే అని సినిమా చూశాక రుజువైంది. ఐతే టాలీవుడ్లో పంచ్ పడినా.. కోలీవుడ్లో మాత్రం చందమామకు ఇదే వీకెండ్లో మాంచి హిట్ పడింది. జయం రవి సరసన ఆమె ‘కోమాలి’ అనే కామెడీ మూవీలో నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.

ఒక కుర్రాడు టీనేజీలో అనుకోకుండా ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్తాడు. పదహారేళ్ల తర్వాత దాన్నుంచి బయట పడి ఈ ప్రపంచంలోకి వస్తాడు. అప్పుడు అతడికి ఎదురయ్యే అనుభవాల నేపథ్యంలో తెరకెక్కిన ‘కోమాలి’ తమిళ ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్విస్తోంది. ట్రైలర్‌ చూస్తేనే సినిమాలో సూపర్ హిట్ కళ కనిపించింది. అందుకు తగ్గట్లే మంచి టాక్ వచ్చింది.

‘తనీ ఒరువన్’ లాంటి బ్లాక్ బస్టర్‌ ఉన్న జయం రవి కెరీర్లో ‘కోమాలి’నే బిగ్గెస్ట్ హిట్‌గా నిలవబోతోందని ట్రేడ్ పండితులు చెబుతుండటం విశేషం. అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరించే సినిమా కావడం దీనికి బాగా కలిసొస్తోంది. ప్రదీప్ రంగనాథన్ అనే యంగ్ డైరెక్టర్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. కాజల్ అగర్వాల్‌ది ఇందులో రెగ్యులర్ గ్లామర్ క్యారెక్టరే అయినప్పటికీ ఆమెకు మంచి హిట్ పడటంతో సంతోషంగా ఉండే ఉంటుంది. ఈ చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English