ఇలా చేస్తే కామెడీ చేయక ఏం చేస్తారు రజనీ సార్

ఇలా చేస్తే కామెడీ చేయక ఏం చేస్తారు రజనీ సార్

తమిళంలో ఇండిపెండెన్స్ డే కానుకగా ‘కోమలి’ అనే సినిమా రిలీజైంది. ఆ చిత్ర ట్రైలర్‌ను ఓ పది రోజుల కిందట రిలీజ్ చేశారు. చాలా సరదాగా సాగిన ట్రైలర్ జనాల్ని బాగానే ఎంటర్టైన్ చేసింది కానీ.. చివర్లో సూపర్ స్టార్ రజనీకాంత్ మీద వేసిన ఒక పంచ్ మాత్రం ఆయన అభిమానులకు రుచించలేదు. ఈ సినిమాలో 20 ఏళ్ల తర్వాత కోమా నుంచి లేచిన హీరో.. తాను అన్నేళ్లు కోమాలో ఉన్నానంటే నమ్మడు.

కావాలంటే టీవీ చూడమంటూ రజనీ రాజకీయాల్లోకి వస్తున్నట్లు చేసిన ప్రకటనను చూపిస్తాడు. ఐతే నన్ను మోసం చేయకండి.. ఇది 20 ఏళ్ల ముందు సంగతే అంటాడు హీరో. అంటే 20 ఏళ్ల నుంచి రజనీ రాజకీయాల్లోకి వస్తానంటున్నాడే తప్ప రావట్లేదని సెటైర్ వేసిందన్నమాట చిత్ర బృందం. దీనిపై రజనీ అభిమానుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ‘కోమలి’ని బాయ్‌కాట్ చేయాలని సోషల్ మీడియాలో ఉద్యమం చేసేవరకు వెళ్లింది వ్యవహారం.

ఐతే నిజ జీవితంలో రజనీ ఏం చేస్తున్నాడో చూస్తే.. అలా సినిమాలో కామెడీ చేయడంలో తప్పేమీ లేదనిపిస్తుంది. రాజకీయాల్లోకి వస్తున్నట్లు.. పార్టీ పెడుతున్నట్లు రజనీ ప్రకటించి రెండేళ్లవుతోంది. కానీ ఇప్పటిదాకా పార్టీ పేరు ప్రకటించలేదు. లోక్ సభ ఎన్నికల ముందు వచ్చి ఎప్పట్లాగే తన మద్దతు ఎవరికీ లేదని.. తన పార్టీ పోటీ చేయట్లేదని.. అభిమానులు ఆలోచించి ఎవరిష్టం వచ్చినట్లు వాళ్లు ఓట్లు వేయాలని అన్నాడు. కమల్ పార్టీ ఎలాంటి ఫలితాలు సాధించిందన్నది పక్కన పెడితే పోటీ చేయనైనా చేసింది.

కానీ రజనీ మాత్రం అలా చేయలేదు. రజనీ అసెంబ్లీ ఎన్నికల్ని టార్గెట్ చేశాడు కానీ.. ఎన్నికలకు ఏడాది ముందు కూడా పార్టీ పేరు ప్రకటించలేదు. ఇప్పుడు ఆయన సన్నిహితులేమో వచ్చే సంక్రాంతికి పార్టీ పేరు ప్రకటిస్తారు.. ఏప్రిల్లో పార్టీ ఆవిర్భావం ఉంటుంది అని ఫీలర్స్ ఇస్తున్నారు. కానీ ఇప్పుడు ఎంచక్కా షూటింగులు చేసుకుంటూ.. గ్రౌండ్ లెవెల్లో దిగి పార్టీ నిర్మాణానికి ఏం చేయాలో చూడకుండా ఎన్నికలకు కొన్ని నెలల ముందు రంగంలోకి దిగితే ఏం ఫలితం ఉంటుంది? మన దగ్గర పవన్ కళ్యాణ్‌‌కు ఎలాంటి అనుభవం ఎదురైందో చూశాక కూడా రజనీ ఇలా చేయడాన్ని ఏమనాలి?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English