విజయ్ సేతుపతి-కాజల్‌లతో ‘అ!’ సీక్వెల్

విజయ్ సేతుపతి-కాజల్‌లతో ‘అ!’ సీక్వెల్

ఒక కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ నాని సొంతంగా సినిమాను నిర్మించాడనేసరికే ‘అ!’ మీద ప్రత్యేక ఆసక్తి ఏర్పడింది ప్రేక్షకుల్లో. కాజల్ అగర్వాల్, రెజీనా, అవసరాల శ్రీనివాస్, ప్రియదర్శి.. ఇలా ఆసక్తికర తారాగణం కూడా తోడై ఈ చిత్రంపై క్యూరియాసిటీ పెరిగింది. సినిమా రిలీజయ్యాక కొందరు అద్భుతమైన ప్రయోగం అన్నారు. ఇంకొందరు కొత్తదనం పేరుతో చేసిన వ్యర్థ ప్రయత్నం అన్నారు.

మొత్తానికి ఈ మిశ్రమ స్పందనతో సినిమా ఏదో ఓ మోస్తరుగా ఆడేసి వెళ్లిపోయింది. ఈ మధ్యే ఈ చిత్రానికి రెండు జాతీయ అవార్డులు రావడంతో మళ్లీ వార్తల్లోకొచ్చింది. ఈ ఊపులో దర్శకుడు ప్రశాంత్ వర్మ ‘అ!’ సీక్వెల్ అనౌన్స్ చేసేశాడు. ‘అ!’లో ప్రధాన పాత్ర పోషించిన కాజల్ అగర్వాల్‌తో పాటు తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కాంబినేషన్లో ఈ సీక్వెల్ తీయాలని యోచిస్తున్నాడు ప్రశాంత్.

‘అ!’ సినిమాకు కొనసాగింపు లాగా ఉండదట దీని సీక్వెల్. కానీ ఆ లైన్లోనే ప్రేక్షకుల్ని సర్ప్రైజ్ చేసే వినూత్న కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుందని ప్రశాంత్ అంటున్నాడు. ఇప్పటికే దీనికి స్క్రిప్టు పూర్తయిందని.. కాజల్‌కు వినిపిస్తే కథ బాగుందని చెప్పిందని.. కానీ ఆమె ఇంకా ఈ సినిమాకు సంతకం చేయలేదని చెప్పాడు ప్రశాంత్. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రకు విజయ్ సేతుపతిని తీసుకోవాలనుకుంటున్నామని.. ఆయన ఎలా స్పందిస్తాడో చూడాలని అన్నాడు.

‘అ!’లో మాదిరి ఇందులో మల్టిపుల్ స్టోరీస్ ఉండవని.. ఒకే కథ ఉంటుందని.. అది ప్రేక్షకుల అంచనాలకు అందని రీతిలో సాగుతుందని అన్నాడు ప్రశాంత్. మరి అతను కోరుకున్నట్లు విజయ్ సేతుపతి, కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకుంటారా.. ఇంతకీ ఈసారి నానీనే నిర్మాతగా వ్యవహరిస్తాడా.. మరొకరు లైన్లోకి వస్తారా అన్నది చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English